కాలుష్య నివారణకు కృషి చేద్దాం | - | Sakshi
Sakshi News home page

కాలుష్య నివారణకు కృషి చేద్దాం

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

గద్వాల క్రైం: ప్లాస్టిక్‌ కాలుష్య నివారణకు ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం కృషిచేయాలని జిల్లా అదనపు న్యాయమూర్తి రవికుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మానవ మనుగడుకు జీవనధారం, స్వచ్ఛమైన గాలి, ప్రకృతి పరమైన మొక్కల నుంచే అందుతాయన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కలుషిత వాతావరణమే కనిపిస్తుందన్నారు. ప్లాస్టిక్‌ నివారణ కోసం ప్రజలు స్వచ్ఛందంగా వాటికి దూరంగా ఉండాలన్నారు. కాలుష్య నివారణ, నియంత్రణ, సకాలంలో వర్షాలు కురవాలంటే మొక్కలే ఆధారమన్నారు. అంతకు ముందు జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీనివాస్‌, నాగరాజు, లక్ష్మి, వెంకటేష్‌ దుర్వా, కోర్టు సిబ్బంది శోభ, న్యాయవాదులు వరలక్ష్మి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

గట్టు: పర్యావరణ పరిరక్షణ సమష్టి బాధ్యతగా స్వీకరించి, ప్రతి ఒక్కరూ ప్రతిఏటా మొక్కలు నాటి, వాటిని సంరరక్షించుకోవాలని గద్వాల ఫారెస్టు రేంజ్‌ అధికారి ఫర్వేజ్‌ అహ్మద్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ముసలంపల్లి రిజర్వు ఫారెస్టులో అటవీ శాఖ అధికారులు, ఉపాధి సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచాలన్నారు. ఇంటి పరిసరాలు, పొలాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను పెంచాలని, తద్వారా వాతవరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని, ఫలితంగా పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందన్నారు. అటవీ భూముల్లో మొక్కలను పెంచి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్‌ అధికారి సుమలత, బీట్‌ ఆధికారి కీర్తి, ఏపీడీ శ్రీనివాసులు, ఏపీఓ స్వామి, బల్గెర సర్పంచు డేవిడ్‌, ఉపసర్పంచు గోపాల్‌, పంచాయతీ కార్యదర్శి సురేష్‌, వాచర్లు వీరారెడ్డి, భీమయ్య పాల్గొన్నారు.

217 క్వింటాళ్ల వేరుశనగ రాక

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు శుక్రవారం 217 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కాగా క్వింటాల్‌ గరిష్టంగా రూ.7,641, కనిష్టంగా రూ.2,519, సరాసరిగా రూ.7,641 ధరలు లభించాయి. అలాగే 16 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,520, కనిష్టంగా రూ.2,316, సరాసరిగా రూ.2,520 చొప్పున పలికాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement