ఫీటు కాల్వలకు.. పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఫీటు కాల్వలకు.. పాట్లు

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

అయిజ: నెట్టెంపాడు ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా మల్దకల్‌ మండలంలోని నాగర్‌దొడ్డి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు సంబంధించిన 106 ప్యాకేజీ పనులు పూర్తి కాకపోవడంతో పంట పొలాలకు సాగునీరందని దుస్థితి నెలకొంది. నిధుల కొరతతో ఫీటు కాల్వ పనులు పూర్తి కాకపోవడంతో ఆయకట్టు విస్తీర్ణం తగ్గిపోయింది. అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషితో నెట్టెంపాడు ప్రాజెక్ట్‌ పనులు 2006లో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 108 ప్యాకేజీ కింద మల్దకల్‌ మండలంలో రూ.18 కోట్లతో 0.7 టీఎంసీల సామర్థ్యంతో నాగర్‌దొడ్డి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించారు. వీటి ద్వారా అయిజ మండలంలోని పంటలకు సాగునీరందించాలనేది ప్రధాన ఉద్దేశం. రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా నాగర్‌దొడ్డి శివారులో 1,380 ఎకరాల రైతుల భూములు ముంపునకు గురయ్యాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం కింద సుమారు రూ.15 కోట్లు చెల్లించింది. అయిజ మండలంలోని 6 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళిక రూపొందించగా.. రిజర్వాయర్‌ పనులు 90 శాతం పూర్తయ్యాయి.

ముళ్లపొదలు.. జమ్ముగడ్డి

నాగర్‌దొడ్డి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోని 106 ప్యాకేజీలో మెయిన్‌ కెనాల్‌ పూర్తయినా లైనింగ్‌ పనులు మాత్రం చేపట్టలేదు. దీంతో కాల్వల్లో ముళ్ల పొదలు, జమ్ముగడ్డి దట్టంగా వ్యాపించాయి. నల్లరేగడి భూముల్లో ప్రధాన కాల్వలు తవ్వడంతో నీరు పారుతున్నప్పుడు మట్టి కరిగిపోయి ప్రతి సంవత్సరం కాల్వల వెడల్పు పెరిగిపోతుండగా.. కాల్వలో మట్టి జారిపడి లోతు ప్రతిఏటా తగ్గిపోతుంది. చాలామంది రైతుల పంట పొలాల్లో ఇంత వరకు ఫీటు కాల్వలు (చిన్నవి) ఏర్పాటు చేయలేదు. ఫీటు కాల్వలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం లేదనే కారణంతో రైతులు తమ పొలాల్లో కాల్వలు తవ్వేందుకు అంగీకరించడం లేదు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్‌ ఏర్పాటు చేసిన ఫీటు కాల్వలను రైతులు పూడ్చివేశారు. దీంతోపాటు ఇతరత్రా కారణాలతో 106 ప్యాకేజీలోని ఆయకట్టులో సగం పొలాలకు కూడా సాగునీరు రావడం లేదు. దీంతో రైతన్నలు కేవలం వర్షాధారంగా పంటలు సాగుచేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

సాగునీరు.. వాగుపాలు

జూరాల మిగులు జలాలు వృథాపోకుండా నెట్టెంపాడు ద్వారా రైతుల పంటలకు పారించాలని రిజర్వాయర్లు నిర్మిస్తే కాల్వల నిర్మాణం పనులు పూర్తికాకపోవడంతో నాగర్‌దొడ్డి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో నీరు ఆయకట్టు భూములకు అందకుండా వాగుల ద్వారా వృథాగా పోతోంది. ఫలితంగా రైతులు పంటలకు నీరు పారించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రైతులు సొంత ఖర్చులతో యంత్రాలతో తాత్కాలికంగా కాల్వలు నిర్మించుకొని డీజిల్‌ ఇంజిన్లతో పైపుల ద్వారా నీరు పారించుకుంటున్నారు. వానాకాలంలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో నీళ్లు నింపుకొని యాసంగి పంటల సాగుకు ఆ నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.

రూ.18 కోట్లతో నాగర్‌దొడ్డి

బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌

రెండు దశాబ్దాలుగా పూర్తికాని

పంట కెనాళ్ల నిర్మాణం

చిన్నపాటి కాల్వల దుస్థితితో

ఆయకట్టుపై ప్రభావం

నీళ్లున్నా నిరుపయోగంగా

మారిన భూములు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement