ఇటిక్యాల: అర్హులైన ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే సర్ (ఎస్‌ఐఆర్) లక్ష్యమని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం మండలంలోని చాగాపురం గ్రామ రైతువేదికలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ, వార్డుసభలు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే ముఖ్య వేదికలన్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై సయగ్ర వివరాలు తెలియజేసి ప్రజలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కాల్వల అభివృద్ధి, సాగునీటి పురోగతిపై గ్రామస్తులతో చర్చించారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలో చెత్తను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం గ్రామంలోని పంచాయతీ కార్యాలయాన్ని, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. గ్రామంలోని రైతులకు కూరగాయల విత్తనాలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సునంద, ఏపీఓ సునీల్, సర్పంచ్ సావిత్రి, పంచాయతీ కార్యదర్శి రవి పాల్గొన్నారు.


