రాజోళి: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. బుధవారం రాజోళి మండలం పచ్చర్లలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కమీషన్లకు ఆశపడి రైతులను మోసంచేసే వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జొన్నల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, పక్షపాతం లేకుండా జరగాలని.. అక్రమంగా అమ్మకాలు చేసే వారిపై, సరిహద్దులు దాటి ధాన్యం తెచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులపై సమాధానం చెప్పాలి
గద్వాలన్యూటౌన్: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పిన తర్వాతే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించాలని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతునాయుడు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన ర్యాలంపాడు, గట్టు ఎత్తిపోతల, నెట్టెంపాడు ప్రాజెక్టుల పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమాత్రం ముందుకు సాగలేదన్నారు. కాల్వల్లో పెరిగిన ముళ్లపొదలను సైతం తొలగించలేదని విమర్శించారు. సీఎం పర్యటన అభివృద్ధి కోసమే అయితే పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన హమీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వెంకటేశ్వర్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, పటేల్ జనార్దన్‌రెడ్డి, కుర్వ పల్లయ్య, చిత్తారి కిరణ్, మోహన్, రామకృష్ణ, వినయ్, శ్రీనివాసులు ఉన్నారు.
వేరుశనగ క్వింటా రూ.8,312
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 161 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 8,312, కనిష్టంగా రూ. 3,080, సరాసరి రూ. 6,510 ధరలు లభించాయి. అదే విధంగా 4 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టం రూ. 6,149, కనిష్టంగా రూ. 5,961 ధర పలికింది. 4 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,489, కనిష్టం రూ. 6,009 ధర లభించింది. 12 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,497, కనిష్టంగగారూ. 2,380, సరాసరి రూ. 2,497 ధర పలికింది.
గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చాటాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నీల్లో గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభ చాటాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. ఎండీసీఏ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీ వరకు జరగనున్న ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–14, 16 క్రికెట్ టోర్నీలను బుధవారం బోయపల్లి సమీపంలోని ఎండీసీఏ మైదానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి ప్రతిభ గల క్రీడాకారులతో ఆరు జట్లను ఎంపిక చేశామన్నారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జట్లు 30 ఓవర్ల మ్యాచ్‌లు ఒక్కో జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడతాయన్నారు. ఈ పోటీలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రతినిధులు సురేష్ కుమార్, వెంకటరామారావు, కోచ్‌లు అబ్దుల్లా, మన్నాన్, పీడీ రమణ, సీనియర్ క్రీడాకారుడు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


