ప్రజా సంక్షేమం.. అభివృద్ధే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమం.. అభివృద్ధే ధ్యేయం

Jun 3 2026 12:21 AM | Updated on Jun 3 2026 12:21 AM

తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌తో ముందుకు

అమరుల త్యాగాల పునాలదులపై ప్రగతి పథం

58,113 మంది రైతులకు రూ. 513.99కోట్ల రుణమాఫీ

రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడావ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి

గద్వాల: ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడావ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడులతో కలిసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కోసం అమరులైన వారి త్యాగాల పునాలదులపై నేటి తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందన్నారు. తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌లో పేదల సంక్షేమం, సమగ్ర విధానాల రూపకల్పన, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, పారదర్శక సుపరిపాలన అనే నాలుగు కీలక అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మార్చి 6 నుంచి నిర్వహిస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా వివిధ థీమ్స్‌పై జిల్లావ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించి.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసినట్లు వివరించారు.

మహిళా సాధికారతకు పెద్దపీట..

మహిళా సాఽధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేసి.. అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. జిల్లాలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో 3.275 కోట్ల మంది మహిళలకు ఇప్పటివరకు సుమారు రూ.117.45 కోట్ల విలువైన ప్రయోజనం కల్పించినట్లు వివరించారు. 8,231 స్వయం సహాయక, వృద్ధుల, దివ్యాంగుల స్నేహ సంఘాల్లో 87,22 మంది మహిళలు సభ్యులుగా ఉండగా.. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 2,283 సంఘాలకు రూ. 17కోట్ల బ్యాంకు రుణాలు, 1095 మంది సభ్యులకు స్రీనిధి ద్వారా రూ. 52కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద 16,391 మందికి రూ. 46.32కోట్ల వ్యయంతో వైద్యసేవలు అందించినట్లు తెలిపారు.

అధికారులకు ప్రశంసా..

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో విశేష కృషి చేసిన వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ, విద్య, పంచాయతీరాజ్‌, ఎస్సీ అభివృద్ధి, యువజన క్రీడలు, వైద్యారోగ్య, అటవీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, పురపాలక, పరిశ్రమల, పోలీస్‌ తదితర శాఖల అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. 172 స్వయం సహాయక సంఘాలకు రూ. 18.38కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను ముఖ్య అతిథులు పరిశీలించారు. అంతకు ముందు కలెక్టరేట్‌, జెడ్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్మృతివనంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద ముఖ్యఅతిథి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పాంజలితో నివాళులర్పించారు. అదే విదంగా స్థానిక పాతబస్టాండ్‌ వద్ద అమరవీరులు పాశం సర్వారెడ్డి, కొట్టం వేణుగోపాల్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర మేకలు, గొర్రెల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్‌ సరిత, వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నీలి శ్రీనివాసులు, అదనపు కలెక్టర్లు మధుమోహన్‌, నర్సింగ్‌రావు, అదనపు ఎస్పీ శంకర్‌, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య పాల్గొన్నారు.

4.50లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం..

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతూ.. మొత్తం 4.50లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. జిల్లాకు 6,899 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 649 ఇళ్లు పూర్తయి, 388 కుటుంబాలు గృహప్రవేశం చేశాయన్నారు. మరో 4,889 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రూ.500 గ్యాస్‌ పథకం ద్వారా 95,736 మందికి రూ. 13.84కోట్ల సబ్సిడీ అందించగా.. గృహజ్యోతి కింద 87,845 కుటుంబాలకు 9.96లక్షల జీరో బిల్లులపై రూ. 25.93కోట్ల సబ్సిడీ అందించినట్లు తెలిపారు. అనంతరం బాలభవన్‌, దివ్య, రెబల్‌డ్యాన్స్‌ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. వారి ప్రతిభను గుర్తిస్తూ.. ముఖ్య అతిథులు జ్ఞాప్తికలను అందజేసి అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement