కాంగ్రెస్‌తోనే అన్నివర్గాల అభ్యున్నతి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే అన్నివర్గాల అభ్యున్నతి

Jun 3 2026 12:21 AM | Updated on Jun 3 2026 12:21 AM

నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి

ప్రజాపాలన – ప్రగతి నివేదిక బస్సు యాత్ర ప్రారంభం

అలంపూర్‌: అన్నివర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. మంగళవారం అలంపూర్‌లో ప్రజాపాలన – ప్రగతి నివేదిక బస్సు యాత్రను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్‌ సరిత, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలిసి ఆయన అలంపూర్‌ ఆలయాలను సందర్శించగా.. ఈఓ దీప్తి అర్చక స్వాములతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీబాలబ్రహ్మేశ్వరస్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించి.. తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి బస్సు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ యాత్ర నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 30 రోజులపాటు కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీతో పాటు అర్హులందరికీ రూ. 5లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను పూర్తిచేసినట్లు చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా.. ఇప్పుడు పాదయాత్ర చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 4న జూరాల ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తారన్నారు. 5న నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలన అనంతరం 50వేల మందితో సభ నిర్వహించి.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నివేదికను ప్రజలకు వివరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement