ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం
● 2014కు ముందు వానాకాలంలో 8.50 లక్షల ఎకరాల్లోపే..
● ప్రస్తుతం 22.54 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు
● యాసంగి సాగులోనూ మూడింతల వృద్ధి
● వరి, పత్తి వైపే రైతన్నల మొగ్గు
తలాపునే కృష్ణమ్మ ఉన్నప్పటికీ
కరువుతో అల్లాడిన ప్రాంతం..
ఎటు చూసినా ఎండిన పంటలు..
బీళ్లుగా మారిన భూములు..
తాగునీటి కోసం తండ్లాట తప్పని
పల్లెలు, పట్టణాలు..
ఉపాధి దొరక్క తట్ట, బుట్ట పట్టుకుని
పిల్లాజెల్లలతో సహా వలసలు..
కిక్కిరిసిన జనాలతో పుణె, బొంబై,
హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు..
విద్య, వైద్యానికి నోచుకోని దీన పరిస్థితులు.. భరోసా లేని బతుకులు
...ఇది ఒకప్పటి పాలమూరు ముఖచిత్రం. ఈ జిల్లా వెనుకబాటుతనం, దయనీయ పరిస్థితులు తెలంగాణ ఉద్యమ గళంగా మారాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భావజాల వ్యాప్తికి దోహదం చేయడంతో పాటు తెలంగాణ వాదులకు సత్తువనిచ్చాయి. పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా.. అనే పాట తెలంగాణ జిల్లాల్లో జ్వాల రగిలించడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ఆకాంక్ష, ‘ప్రత్యేక’ పోరుకు దిక్సూచిగా నిలిచిన పాలమూరు రూపురేఖలు స్వరాష్ట్రంలో క్రమక్రమంగా మారుతున్నాయి. నెర్రెలు బారిన వ్యవసాయ భూముల్లో సిరుల పంటలు పండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలమైన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
యాసంగిలోనూ గణనీయంగా..
ఎండాకాలం సాగుకు సంబంధించి ఉమ్మడి పాలమూరులో గణనీయంగా మార్పు వచ్చింది. 2014లో నాలుగు లక్షల లోపే యాసంగి సాగు అయ్యేది. 2019లో ఇదే సీజన్‌లో 6.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా.. గత ఏడాది 13.44 లక్షల ఎకరాల్లో రైతులు వివధ పంటలు సాగు చేశారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం యాసంగి పంటల సాగు మూడింతలకు పైగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.


