పన్నెండేళ్ల కాలంలో అభివృద్ధి పథంలో నడిగడ్డ ప్రాంతం
గద్వాల: స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరి నేటికీ.. పన్నెండేళ్లు అయ్యింది. రాష్ట్ర సాధనతో నడిగడ్డ ప్రాంతంగా ఉన్న గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల స్వరూపం మారింది. రాష్ట్రం సాధించిన రెండేళ్లకు 2016లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న నడిగడ్డ ప్రాంతం ప్రత్యేక జిల్లాగా అవతరించింది. ఈ క్రమంలో గద్వాల జిల్లా కేంద్రంగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలను కలుపుతూ జోగుళాంబ గద్వాల జిల్లాగా 2016 అక్టోబర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం జిల్లాకు నర్సింగ్ కాలేజీ, జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రిని 200 పడకలకు పెంచడం, మెడికల్ కాలేజీ, అలంపూర్‌లో వంద పడకల ఆస్పత్రి, ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు, విద్యార్థులకు మౌళిక సదుపాయాలు, సాగునీటి రంగంలో నూతనంగా గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు వంటి ప్రధానమైన అభివృద్ధితోపాటు జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరగడం, జిల్లాకేంద్రం గద్వాలపట్టణం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందడం వంటి వాటితో జిల్లా ముఖచిత్రమే మారింది.
ఆర్డీఎస్‌కు తీరని అన్యాయం..
ఆర్డీఎస్ కింద అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. ఉమ్మడి ఏపీలో ఆర్డీఎస్‌కు తీరని అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోసుకునేలా రాజోళి సమీపంలో తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టారు. ఇక్కడి నుంచి నేరుగా కాల్వల్లోకి నీటిని పంపింగ్ చేసి 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా తుమ్మిళ్ల ఎత్తిపోతల డిజైన్ చేశారు. 2018లో అప్పటి సీఎం కేసీఆర్ తుమ్మిళ్లను జాతికి అంకితం చేశారు. అలాగే గట్టు, కేటీదొడ్డి మండలాల పరిధిలో 35 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా 2018లో గట్టు ఎత్తిపోతలకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి.
వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో..
జిల్లా ఏర్పాటు అనంతరం నూతనంగా నర్సింగ్ కాలేజీ మంజూరైంది. అలాగే జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రిని 200 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం నూతన ఆస్పత్రికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే అలంపూర్ చౌరస్తాలో నూతనంగా వంద పడకల ఆస్పత్రి మంజూరు కాగా ప్రస్తుతం అక్కడ ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయి. అలాగే చిరకాల స్వప్నంగా ఉన్న మెడికల్ కళాశాల రెండేళ్ల కిందట మంజూరవగా.. ఈ ఏడాది మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి.
మౌళిక సదుపాయాల కల్పన
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అదేవిధంగా అవసరమైన పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం వంటివి అభివృద్ధి చేశారు.
అన్నిరంగాల్లో అభివృద్ధి..
జిల్లాకేంద్రమైన గద్వాల పట్టణం అన్నిరంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రధానంగా జిల్లాకేంద్రంలో వైద్యం, విద్య, ఇతర రంగాల్లో జరగడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గద్వాల పట్టణానికి వచ్చి స్థిరపడుతున్నారు. ఫలితంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఒకానొక సమయంలో హైదరాబాద్‌తో పోటీపడింది. అలాగే ప్రైవేటు పాఠశాలలు, ఆస్పత్రులు, వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వచ్చారు.
పదేళ్ల కిందట జోగుళాంబ
గద్వాల జిల్లా ఏర్పాటు
ప్రభుత్వ మెడికల్, నర్సింగ్
కళాశాలలు మంజూరు
గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతలు.. పెరిగిన సాగు విస్తీర్ణం
విద్యారంగంలో
మౌలిక వసతులకు పెద్దపీట


