మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. కల్యాణ తంతు జరిపించారు. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమం కనులపండువగా సాగగా.. భక్తులు కనులారా వీక్షించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహా హోమం నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్‌రావు, దీరేంద్రదాసు, సిబ్బంది పాల్గొన్నారు.


