నమ్మించి.. నట్టేట ముంచి! | - | Sakshi
Sakshi News home page

నమ్మించి.. నట్టేట ముంచి!

Jun 1 2026 12:20 AM | Updated on Jun 1 2026 12:20 AM

గద్వాల క్రైం: డిజిటల్‌ యాప్‌ల రాకతో కాళ్లు కదపకుండానే బ్యాంకు రుణాలు, ఇంటి పన్నులు, కరెంట్‌ బిల్లులు తదితర నగదు చెల్లింపులు పూర్తవుతున్నాయి. సాధారణ వ్యక్తితో మొదలుకొని సంపన్నులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు సైతం ఆర్థికపరమైన లావాదేవీలన్నీ దాదాపుగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్‌ నేరగాళ్లు సరికొత్త పంథాతో మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్‌, మొబైల్‌ నంబర్లకు లింక్‌లను పంపిస్తూ.. వాటిని క్లిక్‌ చేయాల్సిందిగా నమ్మబలికి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ మార్కెటింగ్‌లో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు గట్టు, ధరూరు, మానవపాడు, అలంపూర్‌, ఉండవెల్లి, శాంతినగర్‌, అయిజ తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఐదు నెలల కాలంలోనే 98కి పైగా సైబర్‌ నేరాలు చోటుచేసుకోగా.. రూ. 88లక్షల నగదును సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నారు. బాధితుల్లో ఉన్నత విద్యావంతులు, వ్యాపారులు, వైద్యులు, బ్యాంకు మేనేజర్‌ సైతం ఉండటం గమనార్హం.

అత్యాశతో మోసం..

అదనపు ఆదాయం వస్తుందనే అత్యాశే సైబర్‌ మోసగాళ్లకు వరమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా నేరగాళ్లు ప్రజలను ఆకట్టుకొని పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వరకు నమ్మకంగా ఉంటారు. ఆ తర్వాత పత్తా లేకుండాపోతున్నారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి విద్యావంతులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వైద్యులు, యువతతో పాటు మరికొందరు తమ కష్టార్జితాన్ని క్షణాల్లో పోగొట్టుకుంటున్నారు. బాధితులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

అప్రమత్తంగా ఉండాలి..

రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సైబర్‌ నేరగాళ్ల బారినపడి ఎవరైనా మోసపోతే ఫిర్యాదు చేయడానికి కేంద్ర హోంశాఖ ప్రత్యేక వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. సైబర్‌ క్రైం వెబ్‌సెట్‌ లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. సైబర్‌ నేరగాళ్ల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాధితులు పోగొట్టుకున్న డబ్బులు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాసరావు, ఎస్పీ

మచ్చుకు కొన్ని ఘటనలు..

గత మార్చిలో జిల్లా కేంద్రానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి వాట్సప్‌కు చిన్నారుల కోసం నగదు సహాయం పేరిట ఫేక్‌ ఖాతా నుంచి సందేశం వచ్చింది. ఇది నిజమని నమ్మిన సదరు ఉద్యోగి.. వ్యక్తిగత నంబర్‌కు వచ్చిన ఓటీపీని సైబర్‌ నేరగాళ్లకు చెప్పడంతో క్షణాల్లోనే బ్యాంకు ఖాతాలోని రూ.1.50 లక్షలు మాయమయ్యాయి.

గత ఫిబ్రవరిలో అయిజ పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ మార్కెటింగ్‌లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని సైబర్‌ నేరగాళ్లు నమ్మబలికారు. ఇది నమ్మిన సదరు ఉపాధ్యాయుడు.. అందులో పెట్టుబడులు పెట్టాడు. కొంతమేర లాభాలు రావడంతో ట్రేడింగ్‌ కంపెనీ నుంచి నగదు డ్రా చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సదరు కంపెనీ నిర్వాహకులు పన్నుల రూపంలో చెల్లించేందుకు కొంత నగదు జమ చేయాల్సిందిగా పేర్కొన్నారు. దీంతో మరికొంత నగదును డిపాజిట్‌ చేశారు. కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో రూ. 1.50లక్షలు మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత ఏప్రిల్‌లో జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యాపారికి సైబర్‌ నేరగాలు వీడియో కాల్‌ చేశారు. అతడు తప్పుడు ధ్రువపత్రాలతో లోన్‌ తీసుకున్నట్లు నమ్మబలికారు. మీపై కేసు నమోదు చేశామని.. వెంటనే తాము చెప్పిన ప్రాంతానికి రావాల్సిందిగా చెప్పారు. కేసు నుంచి మినహాయింపు కావాలంటే తాము చెప్పిన ఖాతాలోకి ఆన్‌లైన్‌ ద్వారా నగదు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎలాగైనా కేసు నుంచి బయటపడాలని సదరు వ్యాపారి రూ. 1.80లక్షలు ఆన్‌లైన్‌లో జమచేశాడు. ఈ విషయాన్ని తెలిసిన స్నేహితులతో వివరించగా.. మోసం చేసినట్లు స్పష్టమైంది.

ఐదు నెలల్లోనే 98కి పైగాసైబర్‌ నేరాలు

రూ.88 లక్షలకు పైగా కాజేసిన నేరగాళ్లు

ఆన్‌లైన్‌ మోసాలతో జనం విలవిల

ఆందోళన చెందుతున్న ఖాతాదారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement