నిషేధిత దందా | - | Sakshi
Sakshi News home page

నిషేధిత దందా

Jun 1 2026 12:20 AM | Updated on Jun 1 2026 12:20 AM

జడ్చర్ల: వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌ ఆరంభమవుతున్న వేళ బీటీ–3 నిషేధిత పత్తి విత్తనాల చెలామణి కలవరపెడుతుంది. సీజన్‌కు ముందే గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ విత్తన వ్యాపారులు చాపకింద నీరులా అల్లుకుపోతున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో రైతులు సాగుకు సిద్ధమవుతూ.. విత్తనాల కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అయితే విత్తన వ్యాపారులు వారికి ఎక్కువ కమీషన్‌ ఇచ్చే విత్తన కంపెనీలు సరఫరా చేసే నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఈ ఏడాది విత్తనాల కొరత అంటూ కృత్రిమ కొరత సృష్టించే కుట్రలు చేస్తూ.. తమ పబ్బం గడుపుతున్నారు. అయితే రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే ప్రాథమిక స్థాయిలో విత్తన ఎంపిక కీలకం. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తేనే అధిక దిగుబడులు వస్తాయి. ఇందుకు జన్యు, భౌతిక స్వచ్ఛత కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. భౌతిక స్వచ్ఛతకు సంబంధించి గింజ పరిమాణం, రంగు వంటి లక్షణాలను గమనించి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.

వెంటాడుతున్న నాసిరకం విత్తనాలు

నాసిరకం విత్తనాలు రైతాంగాన్ని వెంటాడుతున్నాయి. గతంలో అనేకసార్లు లూజు విత్తనాలకు రంగులద్దీ వివిధ కంపెనీల పేర్లతో ముద్రించిన కవర్లలో నింపి రైతులకు అంటగట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో పలుమార్లు నకిలీ విత్తనాలు, వాటికి సంబంధించిన కవర్లు అనేకం జడ్చర్లలో పట్టుబడిన సంఘటనలు లేకపోలేదు. పత్తి విత్తన కంపెనీలు కలిగిన భూత్పూర్‌లో సైతం అధికారులు పలుమార్లు సోదాలు చేసి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పర్చుకున్నారు. అలాగే జడ్చర్ల మండలంలోని గోప్లాపూర్‌, ఈర్లపల్లి తదితర గ్రామాల్లో పలు వురు రైతుల వద్ద బీటీ–3 పత్తి విత్తనాలు దొరి కాయి. ఈ క్రమంలో ఈసారి నాణ్యత కలిగిన పత్తి విత్తనాలను రైతులకు విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రైతులను చైతన్యపరిస్తేనే..

బీటీ–3 పత్తి విత్తనాలకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చి అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. తద్వారా బీటీ–3 విత్తనాలు సాగు చేయకుండా తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

● బీటీ–3 పత్తి విత్తనాలను అడ్డుకోవడంలో పోలీస్‌, వ్యవసాయ శాఖల నిఘా కొరవడింది. ఇటీవలి వరకు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికే కొంత మంది రైతుల చేతుల్లోకి ఈ విత్తనాలు వెళ్లాయి. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో నిఘా పెంచి బీటీ–3 విత్తనాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

పెరుగుతున్న సాగు విస్తీర్ణం..

కొందరు రైతులు ప్రభుత్వం నిషేధించిన బీటీ–3 పత్తి విత్తనాలను గుట్టుగా సాగు చేస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా జిల్లాలో బీటీ33 పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది. ప్రభుత్వ ఆమోదం లేని బీటీ–3 (హెచ్‌టీ) పత్తి విత్తనాలను సైతం కొందరు వ్యాపారులు గుట్టుగా విక్రయిస్తున్నారు. ఏపీలోని గుంటూరు, మాచర్లతోపాటు గుజరాత్‌ రాష్ట్రాల నుంచి ఇప్పటికే లూజ్‌ పత్తి విత్తనాలు గ్రామాల్లోకి చేరాయి. వీటిని తక్కువ ధరలకే ఇస్తుండటం, కలుపు సమస్య కూడా పెద్దగా లేకపోవడంతో రైతులు ఆయా విత్తనాలే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు బీటీ–1, 2 రకాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉండగా.. బీటీ–3 విత్తనాలకు ఇవ్వలేదు. అయితే అంతగా అవగాహన లేని రైతులకు కొందరు వ్యాపారులు వీటిని అంటగట్టేస్తున్నారు. బీటీ–3 విత్తనాలను రౌండప్‌ రెడీ ప్లెక్స్‌, గ్లైసల్‌ బీటీ పేర్లుతో కూడా పిలుస్తున్నారు.

గుట్టుగా బీటీ–3 విత్తనాల అమ్మకాలు

ఏపీ, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి దిగుమతి

ఇప్పటికే రైతులకు

అంటగడుతున్న వ్యాపారులు

సీజన్‌ ప్రారంభమైనా

మేల్కోని వ్యవసాయ అధికారులు

కలుపు మొక్కల భయంతో బీటీ–3 వైపే రైతుల మొగ్గు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement