మార్కెట్‌లో ఫలరాజుకు అంతంతగానే ధరలు
గట్టు: మామిడి రైతులు ఈసారి గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో గిట్టుబాటు ధరలు లభించక మామిడి రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా 5,020 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేయగా.. అందులో ఈసారి 3,525 ఎకరాల్లో మామిడి తోటలు కాపునకు వచ్చేశాయి. గట్టు, కేటీదొడ్డి, ధరూరు మండలాల్లో ఎక్కువగా మామిడి తోటలను సాగు చేస్తుంటారు. ఇక్కడి భూములు మామిడి సాగుకు అనుకూలంగా ఉండడంతో రైతులు తోటల సాగు వైపు దృష్టిని సారిస్తున్నారు. ఇక్కడ పండిన మామిడి కాయలను హైదరాబాద్‌తోపాటుగా పక్కనే ఉన్న కర్ణాటకలోని రాయచూర్‌కు మార్కెట్లకు తరలిస్తుంటారు. మహారాష్ట్ర నుంచి కూడా కొంత మంది వ్యాపారులు ఇక్కడికి వచ్చి మామిడి కాయలను కొనుగోలు చేస్తుంటారు. మామిడి సీజన్ ప్రారంభంలో పూత విపరీతంగా ఉండగా వాటిని చూసిన రైతులు సంతోషపడ్డారు. అయితే పూత దశ తర్వాత పిందెలు, కాయలుగా మారే క్రమంలో వాతావరణంలో మార్పులు, చీడపీడల కారణంగా పిందెలు రాలిపోవడంతో రైతులు డీలా పడ్డారు. పంట దిగుబడి కేవలం 60 శాతానికి పడిపోగా.. దీనికి తోడు మార్కెట్ ధరలు సీజన్ ప్రారంభ దశలో ఆశాజనకంగా ఉన్నా.. ఆ తర్వాత రేట్లు పడిపోవడంతో మామిడి మరింత నిరాశకు గురయ్యారు. మృగశిర కార్తె (జూన్ 8) వరకు మామిడి తోటల్లో ఉండాల్సిన మామిడి కాయలను మే నెల రెండో వారం (మే 15 వరకు) వరకే ఖాళీ చేశారు. తోటల్లో ఉన్న మామిడి కాయలను పూర్తిగా తెంపి మార్కెట్‌లో తక్కువ ధరకు విక్రయించినట్లు రైతులు వాపోయారు.
లీజుకు తోటలు..
మామిడి తోటల నిర్వహణను కొంతమంది రైతులే స్వయంగా చూసుకుంటుండగా.. మరికొంత మంది వాటిని లీజుకు ఇచ్చేస్తుంటారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన చాలామంది రైతులు ఇక్కడికి వచ్చి మామిడి తోటలను లీజుకు తీసుకుని వాటి నిర్వహణ బాధ్యతలు చేపడుతుంటారు. స్థానికంగా ఉండేవారు కూడా కొంత మేరకు మామిడి తోటలను లీజుకు తీసుకుంటారు. ఇందుకోసం రూ.లక్షల్లో కౌలు చెల్లిస్తారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు.. మార్కెట్ ధరలు మరోవైపు రైతులను కుదురుకోకుండా చేస్తుండడంతో నష్టాల ఊబిలో చిక్కుకుంటారు.
ఈసారి వాతావరణ పరిస్థితులతో తగ్గిన దిగుబడులు
సిండికేట్‌గా మారి చక్రం తిప్పుతున్న వ్యాపారులు
గిట్టుబాటు కాక రైతుల ఆందోళన
జిల్లావ్యాప్తంగా 5,020 ఎకరాల్లో సాగు


