అలంపూర్: నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి ఆయన హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని అలంపూర్, వడ్డేపల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి, ఉండవెల్లి, రాజోలి, మానవపాడు మండలాల్లోని 428 మంది లబ్ధిదారులకు రూ.4,28,49,648 విలువైన చెక్కులు అందజేశామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే తమ దృస్టికి తీసుకురావాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆయా మండలాల రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,529
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 43 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.7,529, కనిష్టంగా రూ.5,320, సరాసరిగా రూ.7,242 ధరలు లభించాయి. 6 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. సరాసరిగా రూ.6,171 ధర పలికింది. 49 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,470, కనిష్టంగా రూ.2,018, సరాసరిగా రూ.2,226 ధరలు వచ్చాయి.
వచ్చేనెల పీయూలో జాతీయ సదస్సు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో జూన్ చివరి వారంలో జాతీ య సదస్సును నిర్వహిస్తున్నట్లు వీసీ జీఎన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. పీయూకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ‘విజన్ ఇండియా 2047 ఇంటిగ్రేటింగ్ సైన్స్ ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్‌మెంట్’ థీమ్‌తో సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. వీరితో పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ, ప్రభుత్వ కార్యదర్శులు, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల వైస్‌ఛాన్స్‌లర్లు, అన్ని యూనివర్సిటీలు, కళాశాలల పీఎం ఉషా స్కీం కోఆర్డినేటర్స్ పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజులపాటు నిర్వహించే కార్యక్రమంలో పలు సెషన్స్‌లో వివిధ అంశాలపై కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇటువంటి కార్యక్రమం దక్షిణ భారత్‌లో నిర్వహించడం మొదటిసారని, గతంలో ఉత్తరభారత్‌లో ఒక సారి నిర్వహించారన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలను యూనివర్సిటీలతో కలిసిపోయే విధంగా కార్యక్రమం ఉంటుందని, స్టార్టప్‌లు, వివిధ కంపెనీలు, రీసెర్చ్ స్కాలర్స్‌తో కార్యక్రమలలో భాగంగా స్టాళ్లను ఏర్పా టు చేసి విద్యార్థులతోపాటు అందరికీ వీటిపై అవగాహన పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ సదస్సు కోఆర్డినేటర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీకి జాతీయస్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం రావడం గొప్ప విషయమన్నారు.


