రైతన్నకు మరో బరువు | - | Sakshi
Sakshi News home page

రైతన్నకు మరో బరువు

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

భారీగా పెరిగిన ఎరువుల ధరలు

ఏటా రెట్టింపవుతున్నపంట పెట్టుబడులు

ఇప్పటికే కూలీలు, ఇతర ఖర్చులతో కుంగుబాటు

తాజాగా ఎరువులతో అన్నదాతలపై మరింత ఆర్థిక భారం

చివరికి రైతులకు మిగిలేది కష్టాలు.. నష్టాలే

ఎరువుల వాడకం

తగ్గించాలి..

ఇష్టానుసారంగా రసాయనిక ఎరువులను వినియోగించడం వల్ల భూసారం తగ్గడంతోపాటు అనేక అనర్థాలు కలుగుతాయి. కాబట్టి రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయాలి. దీనివల్ల ఖర్చు తగ్గడంతోపాటు పంట ఉత్పత్తులు నాణ్యతగా ఉండి, మంచి దిగుబడులు వస్తాయి.

– వీరప్ప, జిల్లా వ్యవసాయాధికారి

ధరలు తగ్గించాలి..

ప్రతి ఏడాది పంట పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడం వల్ల కొత్త కష్టం వచ్చింది. అన్ని రకాల ఎరువుల ధరలు పెరిగాయి. పెరుగుతున్న ధరల ప్రకారం పంటల గిట్టుబాటు ధరలు పెంచడం లేదు. పెంచిన ధరలను తగ్గించాలి. – సూరి, రైతు, గద్వాల

రైతులకు ఇబ్బందే..

ప్రతి పంటకు ఎరువులు వాడాల్సిన పరిస్థితి ఉంది. రకాన్ని బట్టి ఎరువుల బస్తాపై రూ.150 నుంచి రూ.450 వరకు పెరగడం రైతులుగా మా మీద ఆర్థికంగా చాలా భారం పడుతుంది. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం ఏమాత్రం సరిపోవడం లేదు. ఏటా పెట్టబడులు పెరుగుతూ పోతే వ్యవసాయం చేయడం కష్టమే. – అక్కన్న నాయుడు,

రైతు, గోకులపాడు, మానవపాడు మండలం

గద్వాల వ్యవసాయం: ఆరుగాలం కష్టించి పంటలు పండించే అన్నదాతలకు ఉన్న కష్టాలకు తోడు.. ఏటా ఏదో ఒక రూపంలో కొత్త కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం పెరిగిన ఎరువుల ధరలు దరువులు వేస్తున్నాయి. ఏటేటా పెరుగుతున్న పెట్టుబడులతో సతమతమవుతున్న అన్నదాతలకు పెరిగిన ఎరువుల ధరలు మరింత ఆర్థికభారాన్ని మోపనున్నాయి.

క్రమంగా ఎరువుల వాడకం..

గతంలో రైతులంతా సేంద్రియ పద్ధతిన పంటలు పండించే వారు. తర్వాతి కాలంలో వచ్చిన మార్పులు.. ఆహార కొరతను అధిగమించడానికి, దిగుబడులను పెంచడానికి రసాయనిక ఎరువుల వాడకం మొదలైంది. ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా వీటి వాడకం పెరుగుతూ వచ్చింది. రసాయనిక ఎరువులతో మాత్రమే మొక్కలకు అవసరమైన పోషకాలు, ఖనిజాలు తక్షణమే అంది దిగుబడులు పెరుగుతాయని రైతులు నిర్ధారించుకుని, వాటినే వినియోగిస్తూ వస్తున్నారు. మొక్కల పెరుగుదల, వేరు వ్యవస్థను బలోపేతం చేయడానికి, పూత, కాయలు రావడానికి, తెగుళ్లను తట్టుకునేశక్తి రావడానికి వీటిలో ఉండే నత్రజని, భాస్వరం, అమ్మోనియం, పొటాషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయని రైతులు భావిస్తూ వచ్చారు. వరి, పత్తి, కంది, ఆముదాలు, వేరుశనగ, జొన్న, సజ్జ, మొక్కజొన్న ఇలా అన్ని రకాల పంటలతోపాటు కూరగాయలు, పండ్లతోటలను సైతం రసాయనిక ఎరువులతోనే పండిస్తున్నారు.

ఎరువు పాత ధర కొత్త ధర

14–35–14 1,900 2,350

24–24–0 2,000 2,300

10–26–26 1,950 2,250

20–20–0–13 1,800 2,150

16–16–16 1,675 2050

15–15–15–09 1,650 1,950

16–20–0–13 1,400 1,750

ఎంఓపీ 1,850 1,975

ఎస్‌ఎస్‌పీ 615 775

రైతుకు మిగిలేది అప్పులే..

ధర రూ.లలో..)

రూ.వందకుపైనే పెంపు..

కొద్ది రోజుల క్రితమే కంపెనీలు ఎరువుల ధరలను పెంచాయి. 50 కిలోలు ఉండే బస్తాపై ఆయా ఎరువుల రకాన్ని బట్టి రూ.160 నుంచి రూ.450 వరకు పెరిగాయి. నత్రజని, భాస్వరం, పొటాషియం ఉండి అన్నిరకాల పంటల్లో ఎక్కువగా వినియోగించే 14–35–14పై రూ.450 పెరిగింది. పాస్పరస్‌, నైట్రోజిన్‌ ఎక్కువగా ఉండే 24–24–0పై రూ.300, భాస్వరం, పొటాషియం ఉండే 10–26–26 పై రూ.300, నత్రజని, భాస్వరం, సల్ఫర్‌ ఉండే 20–20–013పై రూ.350, నత్రజని, భాస్వరం, పొటాషియం సమాన నిష్పత్తిలో ఉండే 16–16–16పై రూ.375, అమ్మోనియం పాస్పెట్‌, పైట్రోజిన్‌, పాస్పరస్‌, సల్పర్‌ ఉండే 16–20–0–13పై రూ.350 పెంచారు. ఇలా దాదాపు అన్నిరకాల ఎరువుల ధరలు వందకుపైనే పెరిగాయి.

అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. కాలం కలిసి వస్తేనే పంటలు చేతికి వస్తాయి. లేదంటే ఆ ఏడాది రైతుకు మిగిలేది అప్పులే. ఒకవేళ కాలం కలిసొచ్చి.. చేతికి వచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు రావు. ఇలా రైతులు కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు. ఇదిలా ఉంటే.. ఏటేటా పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. రైతు భరోసా, కిసాన్‌ సమ్మాన్‌ యోజన లాంటి పథకాలు ఉన్నప్పటికీ వాటితో పెట్టుబడి అవసరాలు తీరవు. ప్రతి పంటకు పెట్టుబడుల రూపంలో రైతలు చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంట ఉత్పత్తుల రవాణా ఇలా అన్నింటికి ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సిందే. ఇప్పటికే పెరిగిన పెట్టుబడులతో సతమతమవుతున్న రైతన్నకు పెరిగిన ఎరువుల ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన ఎరువుల ధరలతో ఎకరాకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు అదనంగా అన్నదాతపై ఆర్థికభారం పడనుంది. కూలీలు, ఇతర ఖర్చులు బాగా పెరుగుతున్నాయని, ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడం రైతులను మనోవేదనకు గురి చేస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement