ధరూరు: జిల్లాలో ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం తగదని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని భీంపురం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెంటర్ నిర్వహణపై ఆరా తీశారు. సంబంధిత అధికారులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం లోడ్ చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేసి త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలన్నారు. ట్యాబ్ ఎంట్రీలు వెను వెంటనే చేపట్టి ధాన్యాన్ని తరలించడం ద్వారా రైతులకు చెల్లింపుల్లో సమస్యలు తలెత్తకుండా చూడాలని, లారీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నందిని, సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వడ్డీ లేని రుణాలను వినియోగించుకోండి
ధరూరు: ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని, ఈ రుణాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఓ ముసాయిదాబేగం అన్నారు. శుక్రవారం ధరూరులోని మండల మహిళా సమాఖ్య భవనంలో నిర్వహించిన మండల మహిళా సమాఖ్య ఈసీ మీటింగ్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులనుద్దేశించి మాట్లాడారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంతోపాటు వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచు విజయ్‌కుమార్ కోరారు. కార్యక్రమంలో డీపీఎం సలోమి, ఏపీఎం నరహరి, సీసీలు నవీన్, నాగ్యానాయక్, వెంకటేష్, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందని పీజేపీ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 3,005 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. 30 క్యూసెక్కులు ఆవిరి అయ్యిందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.950 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా.. డెడ్ స్టోరేజీ లెవెల్‌లో ఉన్న జూరాల నీటిమట్టం స్థానికంగా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా ఇన్‌ఫ్లోలు రావడంతో తాగునీటి పథకాలకు ఇబ్బందులు తప్పినట్లయింది.
వేరుశనగ @
రూ.7,810
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 64 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడి వచ్చింది. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.7,810, కనిష్టంగా రూ.4,849, సరాసరి రూ.7,190 ధరలు లభించాయి. అలాగే 14 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. సరాసరిగా రూ.5,876 ఒకే ధర పలికింది. 49 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,436, కనిష్టంగా రూ.2,088, సరాసరిగా రూ.2,168 చొప్పున పలికాయి.
పీయూలో నలుగురికి ప్రొఫెసర్లుగా పదోన్నతి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పలు డిపార్ట్‌మెంట్‌లలో పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్‌లుగా పదో న్నతులు కల్పించే ప్రక్రియను చేపట్టారు. 15 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్‌కు పదోన్నతులు కల్పించారు. ఇందులో మైక్రోబయోలజీ డిపార్ట్‌మెంట్‌లో మధుసూదన్‌రెడ్డి, కిషోర్, కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో చంద్రకిరణ్, నూర్జహాన్ ఉన్నారు. కామర్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ్‌కుమార్‌కు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించారు.


