జోగుళాంబ గద్వాల
● అయిదు నెలల్లో 253 కేసులు.. రూ.3.70 లక్షల జరిమానా
● ఒకటి కంటే ఎక్కువసార్లు పట్టుబడితే జైలుశిక్ష విధింపు
● ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసుల చర్యలు
● అవగాహన కల్పిస్తున్నా..
కొందరిలో మారని తీరు
గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026
●
గద్వాల క్రైం: మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులకు కళ్లెం వేసేందుకు జిల్లా పోలీసు శాఖ విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఈ ఏడాది అయిదు నెలల వ్యవధిలో 253 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఇప్పటి వరకు రూ.3.70 లక్షల వరకు జరిమానా విధించారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు తనిఖీల్లో పట్టుబడిన వారికి జైలుశిక్ష పడేలా న్యాయమూర్తుల ముందు హాజరుపరుస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యం మత్తులో బైక్‌లను మితిమీరిన వేగంతో నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు, డ్రంకెన్ డ్రైవ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
యువత.. కూలీలే
పోలీసుల తనిఖీల్లో యువకులు, కూలీలే ఎక్కువగా డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడుతున్నారు. వివిధ గ్రామాల నుంచి జిల్లాకేంద్రంకు వచ్చిన వారే ఉంటున్నారు. నిబంధనలు పాటించకుండా మద్యం మత్తులో వాహనాలను ఇష్టారీతిగా నడపడం, ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం చేస్తున్నారు. పట్టణ శివారుల్లో సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు పోలీసులు తనిఖీలు చేపడుతూ.. మందుబాబుల ఆగడాలను నిలువరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పట్టుబడిన మద్యం బాబులకు కౌన్సిలింగ్ నిర్వహించి మద్యం మత్తులో జరిగే అనర్థాల గురించి వివరిస్తున్నారు.
ప్రమాదాల నివారణకు చర్యలు..
జిల్లావ్యాప్తంగా రాత్రి సమయాల్లో బైక్‌లు రేసు బైక్‌ల్లాగా దూసుకుపోతున్నారు. దురదృష్టవశాత్తు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది యువతే ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల.. ఇంకొందరు మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల మృత్యువాత పడుతున్నారు. దీంతో ప్రమాదాల నివారణకు నిత్యం తనిఖీలు చేపట్టి బ్రీత్ ఎనలైజర్లతో గుర్తించి ఆల్కహాల్ శాతం 35పైన ఉంటే కేసు నమోదు చేసి వారిని కోర్టుకు హాజరుపస్తున్నారు. ఆల్కహాల్ శాతాన్ని బట్టి న్యాయమూర్తి రూ.5 వేల జరిమానా లేదా జైలుశిక్షను అమలు చేస్తున్నారు. ఒక వ్యక్తి పదే పదే పట్టుబడితే రూ.10 వేల జరిమానాతోపాటు లైసెన్స్ రద్దు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు నిత్యం ఎక్కడో చోట అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు


