ఎర్రవల్లి: రైతులు యాసంగిలో సాగు చేసిన పంటల వ్యర్థాలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప అన్నారు. బుధవారం మండలంలోని జింకలపల్లి శివారులో మొక్కజొన్న పంట అవశేషాలను కాలుస్తున్న పొలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వానాకాలం కోసం రైతులు భూమిని సిద్ధం చేసుకుంటున్న తరుణంలో గత పంటలకు సంబంధించిన వ్యర్థాలను తొలగించేందుకు సులభమైన మార్గంగా కాల్చివేస్తారని, ఇలా చేయడం వల్ల రైతులకు లాభాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయని చెప్పారు. పంట వ్యర్థాల దహనం వల్ల నేలలోని సేంద్రియ కర్బనం దెబ్బతింటుందని, దీంతోపాటు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన, సూక్ష్మ పోషకాలు కూడా నశిస్తాయన్నారు. దీని ప్రభావంతో భూసారం తగ్గి భవిష్యత్‌లో రైతులు రసాయనిక ఎరువులపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. అలాగే పంటల దహణం వల్ల కాలుష్యం పెరిగి.. ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా శాసీ్త్రయ పద్ధతులను అనుసరించి నేల సారాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ సురేష్‌గౌడ్, రైతులు పాల్గొన్నారు.


