ఎర్రవల్లి: ప్రభుత్వం రైతులకు అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. మంగళవారం ఎర్రవల్లి సింగిల్‌విండో ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై జిప్సం, జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలం సీజన్‌కు సంబంధించి 90శాతం రాయితీపై జిప్సం, 50శాతం రాయితీపై జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. 30కిలోల జీలుగ విత్తనాల ధర రూ. 4,904 ధర ఉండగా.. రైతులు రూ. 2,452 చెల్లిస్తే సరిపోతుందన్నారు. అదే విధంగా 50కిలోల జిప్సం ధర రూ.283 ఉండగా.. రాయితీ పోను రూ.28.30 చెల్లించాలని తెలిపారు. జీలుగను సాగుచేసి భూమిలో కలియదున్నడం ద్వారా సహజ ఎరువు లభిస్తుందన్నా రు. తద్వారా రైతులకు పెట్టుబడులు తగ్గి, దిగు బడి పెరుగుతుందన్నా రు. వేరుశనగ పంటలో జిప్సం వినియోగించడం ద్వారా నాణ్యమైన దిగుబడి ఉంటుందన్నారు. జిప్సం, జీలుగ విత్తనాలు అవసరమున్న రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో పీఏసీఎస్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, డీఏఓ వీరప్ప, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, పీఏసీఎస్ చైర్మన్ రంగారెడ్డి, ఏఓలు సురేశ్‌గౌడ్, రవికుమార్, సర్పంచ్ అనిత, నాయకులు వెంకటేశ్‌యాదవ్, జోగుల రవి, శ్రీధర్‌రెడ్డి, నారాయణ నాయుడు, గిడ్డారెడ్డి, కృష్ణసాగర్ తదితరులు పాల్గొన్నారు.


