హెలికాప్టర్‌ ప్రమాదం.. 8 మంది మృతి | West Kalimantan Helicopter Crash | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌ ప్రమాదం.. 8 మంది మృతి

Apr 17 2026 11:36 AM | Updated on Apr 17 2026 11:58 AM

West Kalimantan Helicopter Crash

జకార్తా: ఇండోనేసియాలోని పశ్చిమ  కలిమంతన్ ప్రావిన్స్‌లో ఘోరం జరిగింది.  దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్‌ కుప్పకూలడంతో అందులో ఉన్న ఎనిమిది మంది మృతి చెందినట్లు ఇండోనేషియా నేషనల్‌ పోలీస్‌(INP) ధ్రువీకరించింది. పి.టి మాథ్యూ ఎయిర్‌కు చెందిన ఎయిర్‌బస్ H-130 (PK-CFX) హెలికాప్టర్ అదృశ్యమైనట్లు వార్తలు రాగా.. చివరకు సెకాడౌ ప్రాంతంలో దాని శకలాలను సహాయక బృందాలు గుర్తించాయి.

ప్రస్తుతం ప్రమాద స్థలంలో మృతదేహాల వెలికితీత ప్రక్రియ కొనసాగుతోందని రెస్క్యూ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ నూరహ్మాన్ గింధా ద్రాధిజ్య తెలిపారు. ప్రస్తుతానికి నలుగురి మృతదేహాలను వెలికితీశామని.. మరో ముగ్గురు మృతదేహాలు హెలికాప్టర్ శిథిలాల మధ్య చిక్కుకుని ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

హెలికాప్టర్‌లో మొత్తం ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నట్లు నిర్ధారించారు. గురువారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:25 గంటలకు ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన సూపర్ ప్యూమా హెలికాప్టర్ ఈ శకలాలను గుర్తించింది. హెలికాప్టర్ చివరిసారిగా సంప్రదింపులు జరిపిన ప్రదేశానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో తోక భాగం పడి ఉన్నట్లు గుర్తించారు.

నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ డిప్యూటీ ఎడి ప్రాకోసో మాట్లాడుతూ.. వైమానిక నిఘా ద్వారా కచ్చితమైన కోఆర్డినేట్లను గుర్తించి.. గ్రౌండ్ టీమ్స్‌కు సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే.. ప్రమాదం జరిగిన ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడికి చేరుకోవడం సహాయక బృందాలకు సవాలుగా మారింది. ప్రమాద సమయంలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని బుకిట్ పుంటాక్ ప్రాంత నివాసితులు అధికారులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement