ఇరాన్- అమెరికా మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం మరో రెండు రోజుల్లో ఏప్రిల్ 21తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిభాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలలో ప్రాథమిక అంశాలలో చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. తుదిదశ చర్చలకు రెండు దేశాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయన్నారు.
ఇటీవల అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సరైన సయోధ్య కుదరకపోవడంతో చర్చలు ఎటువంటి సానూకూల ఫలితాలు లేకుండానే ముగిశాయి. అయితే ఇరు దేశాల మధ్య కుదిరిన సీజ్‌ఫైర్ ఒప్పందం ఈ నెల 21తో ముగుస్తోంది. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య మరో దపా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పీకర్ తన అభిప్రాయాల్ని మీడియాతో పంచుకున్నారు.
మహ్మద్ గాలిఫ్ మాట్లాడుతూ " ప్రస్తుతం రెండు దేశాల మధ్య కొన్ని విషయాల్లో తీవ్ర అభ్యంతరాలున్నాయి. తుదిదశ చర్చలకు ఇంకా చాలా దూరంలో ఉన్నాం. ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయం సాధించింది. అందుకే కాల్పుల విరమణకు అంగీకరించాం". అన్నారు. శత్రుదేశం తమ స్వలాభం కోసం ఎన్నో డిమాండ్లను ఇరాన్‌పై రుద్దే ప్రయత్నం చేసింది. కానీ మేము వాటిని ఎదుర్కొన్నాం. పోరాటంలో చర్చలు కూడా ఓ భాగమే అని మహ్మద్ గాలిఫ్ అన్నారు.
తదుపరి చర్చల మాట్లాడే అంశాలపై చివరి దశ ఫ్రేమ్ వర్క్ రూపొందిస్తున్నామని ఇరాన్ ప్రతినిధులు ఈ అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారని తెలిపారు. మరోవైపు ట్రంప్ సైతం ఈ అంశంపై స్పందిస్తూ ప్రస్తుతం రెండు దేశాల మధ్య చాలా మంచి సంభాషణలు జరుగుతున్నాయి.
ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ అంశంపై మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగానే ఉన్నాయని, అయితే ఇరాన్ తమను "బ్లాక్‌మెయిల్" చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే మళ్ళీ బాంబుల దాడి మొదలుపెడతామని అంతకుముందు ఆయన హెచ్చరించారు.
ఇస్లామాబాద్ భేటీ
ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ , గాలిబాఫ్ నేతృత్వంలోని బృందం మధ్య చర్చలు జరిగాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఈ స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి. అనంతరం మరోదఫా చర్చలు పాకిస్థాన్ వేదికగా రేపు ( సోమవారం) జరగనున్నట్లు సీఎన్‌ఎన్ నివేదిక వెల్లడించింది.
మరోసారి టెన్షన్
అయితే ఇరు దేశాల మధ్య సానూకూల వాతావరణం వచ్చినట్లే వచ్చి మరోసారి ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ తొలుత హర్ముజ్‌పై విధిస్తున్న దిగ్భందం తీసివేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఇరాన్ మరోసారి జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మరో దఫా చర్చలలో ఏం జరగనుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.


