దాడికి 10 నిమిషాల ముందు ఏం చేశాడంటే.. | US press gala shooting suspect wrote manifesto before attack | Sakshi
Sakshi News home page

దాడికి 10 నిమిషాల ముందు ఏం చేశాడంటే..

Apr 27 2026 7:43 AM | Updated on Apr 27 2026 12:44 PM

US press gala shooting suspect wrote manifesto before attack

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇతర ఉన్నతాధికారులపై హత్యాయత్నం వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. వాషింగ్టన్‌ హిల్టన్‌ హోటల్‌లో దాడికి ముందు అనుమానితుడు తన కుటుంబానికి ఓ సుదీర్ఘమైన లేఖ(మేనిఫెస్టో) రాశాడు. అందులో దాడికి కారణాలు.. తన లక్ష్యం.. అలాగే ఆ దాడిని ఈ తరహాలోనే ఎందుకు చేయాలనుకుంది.. మొత్తం చెప్పుకొచ్చాడు.

తనను తాను ఫ్రెండ్లీ ఫెడరల్‌ అస్సాసిన్‌’ అంటూ సంబోధించుకున్న ఎలెన్‌ ఇలా రాసుకొచ్చాడు.. హింసకు హింసతో ప్రతిస్పందించకూడదు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించు అని క్రైస్తవం చెబుతుంది. వ్యక్తిగత అవమానాలు లేదా దాడులు ఎదురైనప్పుడు ప్రతీకారం తీర్చుకోవద్దు అని అంటోంది. కానీ, ఇతరుల చెంప మీద కొడుతున్నప్పుడు మౌనంగా చూడమని కాదు. అలాంటి సమయంలోనూ స్పందించకపోతే అణచివేతకు సహకరించినట్లే అవుతుంది.

నిత్యం అఘాయిత్యాలు, ఆకలి కేకలు, వేధింపులు, అన్యాయంగా మరణశిక్షల విధింపు.. వీటిని చూస్తూ భరించలేకపోతున్నా. సాధ్యమైనంత వరకు ప్రాణనష్టం తగ్గించాలని భావిస్తున్నా. కానీ, ఒక రేపిస్ట్‌, ద్రోహి.. పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన వ్యక్తి ప్రసంగం వినడానికి చాలామంది వచ్చారు. నా లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో..

తన కుటుంబ సభ్యులు, సహచరులు, విద్యార్థులు, ప్రయాణికులు, హోటల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే తన నిర్ణయాలు ఇతరులకు నష్టం కలిగించవచ్చని క్షమాపణలు తెలియజేశాడు.

అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి వాషింగ్టన్‌ హిల్టన్‌ హోటల్‌లో వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ అసోసియేషన్‌’(డబ్ల్యూహెచ్‌సీఏ) విందు సమావేశం జరిగింది. పదేళ్ల తర్వాత ఆ డిన్నర్‌కు హాజరైన ట్రంప్‌.. మరికాసేపట్లో మాట్లాడాల్సి ఉంది. ఈలోపు.. 8.34గం. ప్రాంతంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.

హాల్‌ బయట కాల్పులు జరుగుతుండడంతో ట్రంప్‌ దంపతుల చుట్టూ భద్రతాధికారులు వలయంగా ఏర్పడి వేదిక వద్ద నుంచి తరలించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ దంపతులను, ఇతర అధికారులనూ  సిబ్బంది బయటకు తీసుకెళ్లారు.  తుపాకులు, కత్తులతో వచ్చిన ఆగంతుకుడిని మీటింగ్‌ జరుగుతున్న బాల్‌రూంవైపు వెళ్లకుండా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ఆపేశాయి. సంకెళ్లు వేసి ఆపై అక్కడి నుంచి తరలించాయి. నిందితుడు కోల్‌ టొమాస్‌ ఎలెన్‌ను (31)గా ధృవీకరించిన దర్యాప్తు సంస్థలు.. కాలిఫోర్నియా టొరాన్స్‌లో అతనో టీచర్‌గా చెబుతున్నారు. అంతేకాదు.. ఎలెన్‌ అదే హోటల్లో బస చేశాడని అధికారులు గుర్తించారు.

లిస్ట్‌ నుంచి ఆయనొక్కడికే మినహాయింపు.. 
ఎలెన్‌ లిస్ట్‌లో ఉన్న పేర్లు బయటకు రావాల్సి ఉంది. అయితే.. ట్రంప్‌ సహా ఆయన ప్రభుత్వంలోని హైలెవల్‌ నుంచి లోలెవల్‌ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్‌ నుంచి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ పేరు మాత్రం మినహాయించబడిందట. ఎలెన్‌ ఆయన్ని మాత్రమే ఎందుకు తప్పించాడు అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే హోటల్‌ సిబ్బందిని కూడా దాడి నుంచి మినహాయించుకున్నాడని తెలుస్తోంది.

ఇవాళే కోర్టుకు.. 
వాషింగ్టన్ హిల్టన్‌లో భద్రతా తనిఖీ కేంద్రాన్ని దాటి, అధికారులతో కాల్పులు జరిపిన తర్వాత ఎలెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా యు.ఎస్. అటార్నీ జీనిన్ పిర్రో ఏం చెబుతున్నారంటే.. అతనిపై ఫెడరల్ ఆయుధాలు, దాడి కేసులు నమోదు చేయబడ్డాయి.  అదనపు కేసులు నమోదు చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు.

తనపై జరిగిన హత్యాయత్నంపై డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పందించారు. ‘‘ఎలెన్‌ క్రైస్తవ వ్యతిరేకి. క్రైస్తవుల పట్ల అతనిలో విద్వేషం పెరిగిపోయింది. అతనో మానసిక రోగి. గతంలో అతనిపై సోదరుడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు’’ అని ట్రంప్‌ అన్నారు. అంతకు ముందు దాడిపై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అధ్యక్షుడిగా ఉండటం ప్రమాదకరమైన పనైనా నేను భయపడలేదు. మెలనియా కూడా పలుమార్లు నాతో ఈ విషయం చెప్పింది. జరిగిన దాని గురించి ఇక ఆలోచించను. ఎప్పటిలాగే పని చేసుకుంటూ వెళ్తా. దేనిని ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కొంటానని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement