వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు హర్మూజ్ జలసంధిలో నౌకల్ని ఆపేస్తూ, మరో వైపు ఇరాన్‌ను బయపెట్టించేలా ఆ దేశంపై మరోసారి ముప్పేట క్షిపణులతో దాడి చేసే అవకాశాలపై ట్రంప్ తన సీనియర్ సలహాదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
నిన్న ఇదే అంశంపై ట్రంప్ ఫ్లోరిడాలోని డోరల్ రిసార్ట్‌లో ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడారు. దౌత్యపరమైన పరిష్కారానికి సిద్ధంగా ఉన్నానంటూనే ఇరాన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. ‘హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగిస్తూ, ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేయాలని అనుకుంటున్నాను. కానీ నేను అలా చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే హర్మూజ్ జలసంధి ఇరాన్‌ది. సముద్రపు నీటిని త్రాగునీటిగా మార్చే సాలినేషన్ ప్లాంట్లు వాళ్లవి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వాళ్లవి. వాటిపై సులభంగా దాడి చేయొచ్చు’ అని అన్నారు.
యుద్ధం ప్రారంభ దశలో భాగమైన బాంబింగ్ దాడుల్ని మళ్లీ ప్రారంభించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ట్రంప్ సలహాదారులు మాత్రం ఈ తరహా దాడులు చేసే అవకాశం తక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కారణం.. బాంబింగ్ దాడులతో ప్రాంతీయ అస్థిరతను మరింత పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ట్రంప్ దీర్ఘకాలిక సైనిక యుద్ధాల్ని కొనసాగించేందుకు ఇష్టపడటం లేదని వారు చెబుతున్నారు.
మరో ప్రత్యామ్నాయం తాత్కాలికంగా ఆంక్షలను కొనసాగిస్తూ.. దీర్ఘకాలంలో హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా మిత్రదేశాలను బాధ్యత వహించేలా ఒత్తిడి చేసే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రతినిధి ఒలివియా వేల్స్ తెలిపారు. ‘ట్రంప్ ఇప్పటికే హర్మూజ్ జలసంధిపై నావికాదళ ఆంక్షలు విధించారు. ఇరాన్ దోపిడీని ఆపారు. అదనపు అన్ని అవకాశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు’ అని వాల్ స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు.
ఇరాన్‌తో చర్చలు విఫలమైన తర్వాత ట్రంప్ ఏ చర్యలకు ఉపక్రమించనున్నారనే అంశాలపై వస్తున్నవన్నీ ఊహాగానాలేనని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ట్రంప్ మాత్రం ఇరాన్ తిరిగి చర్చలకు రావాలనుకుంటుందని పేర్కొన్నారు.


