ఇరాన్‌తో యుద్ధంలో న్యూక్లియర్‌ వెపన్స్‌పై ట్రంప్‌ క్లారిటీ | Trump Clarity On Nuclear Weapons In War With Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌తో యుద్ధంలో న్యూక్లియర్‌ వెపన్స్‌పై ట్రంప్‌ క్లారిటీ

Apr 24 2026 7:52 AM | Updated on Apr 24 2026 8:44 AM

Trump Clarity On Nuclear Weapons In War With Iran

వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంలో న్యూక్లియర్‌ వెపన్స్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టతనిచ్చారు. యుద్ధంలో  న్యూక్లియర్‌ వెపన్స్‌ వాడాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ దాడులద్వారానే ఇరాన్‌ సైన్యం చిన్నాభిన్నమైందంటూ వ్యాఖ్యానించారు. పర్మినెంట్‌ డీల్‌ కోసమే చూస్తున్నామని.. ప్రస్తుతం ఇరాన్‌ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ దెబ్బతిన్నాయంటూ ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

మరోవైపు, పశ్చిమాసియా యుద్ధంలో మునిగిపోయిన ఇరాన్‌ను ఆర్థిక సుడిగుండంలో నిండా ముంచేందుకు హార్మూజ్‌ జలసంధిని గుప్పిట పట్టామని ట్రంప్‌ పునరుద్ఘాటించారు. జలసంధిపై తమ ఆధిపత్యాన్ని కొనసాగేంచేందుకు అగ్రరాజ్య నావికాదళాలకు ఆయన గురువారం కీలక ఆదేశాలిచ్చారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘హార్మూజ్‌ జలసంధిలో మన యుద్ధ నౌకలు, విదేశీ నౌకల రాకపోకలను పెను ప్రమాదంలోకి నెట్టేసే సముద్రమందుపాతరను వెనువెంటనే ఏరిపారేయండి.

..కొత్తగా మందుపాతరలను పెట్టేందుకు సముద్రజలాల్లో సంచరించే ఇరాన్‌ పడవలను వెంటనే పేల్చేయండి. అవి చిన్నపడవలు అనే కనికరం అస్సలు చూపకండి. ఇప్పటికే మన దెబ్బకు ఇరాన్‌ నావికాదళంలోని కీలక 159 నౌకలు మునిగిపోయి సముద్రగర్భంలోకి చేరాయి. మన మైన్‌ ‘స్వీపర్లు’ ఇప్పటికే సీమైన్స్‌ను ఏరిపారేయడంలో నిమగ్నమ య్యాయి. ఈ పనిని మూడు రెట్లు అత్యధిక వేగంతో పూర్తిచేసే బాగుంటుంది.

హార్మూజ్‌ దిగ్బంధం కొనసాగుతుంది. ఇరాన్‌ మనతో ఒప్పందం కుదుర్చుకునేదాకా మన అనుమతి లేకుండా ఏ ఒక్క నౌక ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఐఆర్‌జీసీ ఆధిపత్యం, పాలకులతో విబేధాలతో తమ అసలైన అత్యున్నత నేత ఎవరు అనేది తేల్చుకోవడం ఇరానియన్లకు కష్టంగా మారింది. అతివాద నేతలేమో మన దాడుల్లో చనిపోతు న్నారు. ఉదారవాదులకు కాస్తంత గౌరవం దక్కుతోంది. ఇది నిజంగా క్రేజీ విషయం’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

‘‘ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం ఆత్రంగా ఎదురుచూడట్లేము. మాకు తొందరేం లేదు. యుద్ధాన్ని త్వరగా ముగించి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ట్రంప్‌ అన్నారు. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకే జలసంధి దిగ్బంధించామని అమెరికాæ ఆర్థిక మంత్రి స్కాట్‌బీసెంట్‌ అన్నారు. ‘‘ఈ విషయంలో మా అధ్యక్షుడు స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. హార్మూజ్‌ సహా ఇరాన్‌ నౌకాశ్రయాలను దిగ్బంధిస్తే ముడిచమురు సరఫరా ఆగిపోతుంది.

దీంతో ఖర్గ్‌ ద్వీపంలోని ముడిచమురు నిల్వకేంద్రాలన్నీ క్రూడా యిల్‌లో నిండిపోతాయి. చమురుబావుల నుంచి సరఫరా అయ్యే ముడిచమురును నిల్వచేయడానికి చోటే ఉండదు. అప్పుడు తప్పనిపరిస్థితుల్లో చమురుబావుల నుంచి వెలికితీత ఆపేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆపేస్తే మళ్లీ మొదలెట్టడం శ్రమతోకూడిన సంక్లిష్ట ప్రక్రియ. దీంతో ఆదాయం లేక ఇరాన్‌ చేతులెత్తేస్తుంది’’ అని హెచ్చరించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement