భారతీయ మేధస్సుపై ట్రంప్ వ్యాఖ్యలు.. ఆత్మగౌరవానికి దెబ్బ | Sakshi TV Managing Editor Kancharla Yadagiri Reddy Reacts Strongly To Donald Trump Remarks On Indian Diaspora | Sakshi
Sakshi News home page

భారతీయ మేధస్సుపై ట్రంప్ వ్యాఖ్యలు.. ఆత్మగౌరవానికి దెబ్బ

Apr 27 2026 10:45 AM | Updated on Apr 27 2026 11:12 AM

 Sakshi TV Managing Editor Kancharla Yadagiri Reddy On TRUMP Comments

నేడు ప్రపంచ యవనికపై ఒక వికృత దృశ్యం ఆవిష్కృతమైంది. ఏ దేశమైతే స్వేచ్ఛకు, సమానత్వానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకుంటుందో.. ఏ దేశమైతే వలసదారుల రక్తం, చెమట మీద నిర్మించబడిందో.. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు భారతీయ వలసదారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమైనవి. భారతీయులు నరకం నుంచి వస్తున్నారంటూ ఒక లేఖను సోషల్ మీడియాలో షేర్ చేయడం అత్యంత దారుణమైన విషయం. ఇది కేవలం ఒక దేశాధ్యక్షుడు చేయాల్సిన ప్రకటన కానే కాదు, ఇది ఒక జాతి మేధస్సుపై చేసిన దాడి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి తగిలిన గాయం. అధ్యక్షుడు ట్రంప్ గారూ మీరూ… ఒక్కసారి చరిత్ర పుటలు తిరగేయండి. మీ అహంకారపు పునాదుల కింద ఉన్నది భారతీయ మేధస్సు అని మర్చిపోకండి!

అమెరికా వెన్నెముక.. భారతీయులే అన్న విషయాన్ని విస్మరించకండి. అసలు భారతీయులు లేని అమెరికాను ఊహించడం అసంభవం. గణాంకాలు ఏం చెబుతున్నాయో మీరే చూడండి.  సుందర్ పిచాయి లేని గూగుల్, సత్య నాదెళ్ల లేని మైక్రోసాఫ్ట్, అరవింద్ కృష్ణ లేని IBM, శంతను నారాయణ్ లేని అడోబ్.. ఇవి కేవలం పేర్లు కావు, అమెరికాను ప్రపంచానికి నాయకుడిగా నిలబెట్టిన మేధావులు. మీరు ఈ రోజు వాడుతున్న విండోస్ నుంచి సెర్చ్ చేస్తున్న గూగుల్ వరకు ప్రతి అణువులోనూ భారతీయుడి మేధస్సు ఉంది. అమెరికాలోని అత్యంత శక్తివంతమైన 500 కంపెనీల్లో దాదాపు 35 శాతం కంపెనీల సారథులు భారతీయులే. సుందర్ పిచాయి, సత్య నాదెళ్ల మాత్రమే కాదు.. లీనా నాయర్ (చానెల్), రవి కుమార్ (కాగ్నిజెంట్), నిమేష్ షా.. ఇలా ఒక సుదీర్ఘమైన జాబితా ఉంది. వీరు లేకపోతే అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది.

అమెరికా జనాభాలో భారతీయులు కేవలం 1.5 శాతం మాత్రమే. కానీ అమెరికా చెల్లించే మొత్తం ఆదాయపు పన్నులో భారతీయుల వాటా దాదాపు 6 శాతం. అంటే 300 పై చిలుకు బిలియన్ డాలర్లు. అంత పెద్ద మొత్తంలో ఖజానాకు పన్నుల రూపంలో ఇస్తున్నది భారతీయులే.  అంతే కాదు అమెరికాలో ప్రతి నలుగురు వైద్యులలో ఒకరు భారతీయులే. భారతీయులు గనుక ఒక్క రోజు సమ్మె చేస్తే అమెరికా ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి ఏమిటో అమెరికా అధ్యక్షుడు ఒక సారి గుర్తు చేసుకుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఒకవేళ భారతీయులు అక్కడ నరకాన్ని సృష్టిస్తే, ఆ నరకంలో నుంచి అమెరికన్లను కాపాడే దేవుళ్లు ఎవరు? అంతెందుకు మీరు గొప్పగా చెప్పుకునే నాసా లోని శాస్త్రవేత్తలలో 36 శాతం మంది భారతీయులే. అంటే అమెరికా జెండా అంతరిక్షంలో రెపరెపలాడాలన్నా, వెనక ఉండాల్సింది భారతీయుడి మేధస్సే.

అమెరికా గత 50 ఏళ్లుగా గ్రీన్ కార్డ్ ఆశ చూపి మన దేశంలోని అత్యుత్తమ మేధస్సును దోచుకుంది. ఐఐటీలు, ఐఐఎంలలో మన ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తే.. ఆ మేధస్సును వాడుకుని అమెరికా లాభపడింది. తీరా పనయ్యాక, ఇప్పుడు నరకం అని ముద్ర వేస్తారా? ఇదేనా మీ సంస్కారం? గత అమెరికా అధ్యక్షులు తెలివైన వారు కాబట్టే భారత్ నుంచి మేధో వలసను ప్రోత్సహించారు. తద్వారా అమెరికా నేడు అగ్రరాజ్యమైంది. కానీ నేడు ట్రంప్ ఆ మేధావులను నరకం నుంచి వచ్చిన వారుగా సంబోధించడం ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ఠ. ఏ నోటితో అయితే భారతీయులను దూషిస్తున్నారో, అదే నోటితో మళ్ళీ భారతీయ ఐటీ కంపెనీల సాయం కోరడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. 

అమెరికా అభివృద్ధి చెందింది వారి సొంత తెలివితేటలతో కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను, ముఖ్యంగా భారతీయులను ఆకర్షించి, వారిని వాడుకోవడం వల్ల మాత్రమే. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? మన దేశ గడ్డపై పుట్టి, ఇక్కడి నీరు తాగి, ఇక్కడ చదువుకుని.. అమెరికాను నిర్మిస్తున్న మన మేధావులను అవమానిస్తుంటే మన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇది దౌత్యపరమైన అంశం మాత్రమే కాదు, ఇది మన దేశ గౌరవానికి సంబంధించిన విషయం. మన టెక్కీలను, డాక్టర్లను, సైంటిస్టులను తిరిగి రండి.. మీ దేశాన్ని నిర్మించండని పిలిచే దమ్ము మన దేశ నాయకత్వానికి లేదా?పొరుగున ఉన్న చైనా గూగుల్ లేకుండా నడవగలుగుతోంది, వాట్సాప్ లేకుండా ఉండగలుగుతోంది. మరి భారత్ ఎందుకు గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్‌లపై ఆధారపడాలి? మన డేటాను వారు వాడుకుంటూ, మన దేశం నుంచి బిలియన్ డాలర్ల కొద్దీ వ్యాపారం చేస్తూ మనపైనే అహంకారం ప్రదర్శిస్తే ఎందుకు మౌనంగా ఉండాలి? 

మేకిన్ ఇండియా అనేది కేవలం నినాదం కాదు, అదొక నిప్పు కణిక కావాలి. మన మేధావులతో సరికొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ తీసుకురావాలి. భారతీయులను గౌరవించని దేశాల యాప్‌లను మన దేశంలో ఎందుకు అనుమతించాలి? చైనా తరహాలో మనం కూడా మన సొంత డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ కేవలం ఖండనలతో సరిపెట్టకూడదు. మా టెక్కీలను, మా డాక్టర్లను వెనక్కి రమ్మని భారత ప్రధాని ఎందుకు పిలుపు ఇవ్వకూడదు? గూగుల్ లేదా ఏఐ సెర్చ్ ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా మనం సెర్చ్ ఇంజిన్ తయారు చేయలేమా? వాట్సాప్ కు బదులు మన సొంత మెసేజింగ్ యాప్ తీసుకురావడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది? మన డేటాతో అమెరికా కంపెనీలు బిలియన్ల లాభాలు గడిస్తున్నాయి. ఆ డేటాను మన దేశంలోనే ఎందుకు భద్రపరచుకోకూడదు?

మేకిన్ ఇండియా - ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? చైనా తన దేశంలో విదేశీ యాప్‌లను నిషేధించి సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. భారత్ ఆ సాహసం ఎందుకు చేయకూడదు? మన దగ్గర ప్రతిభ ఉంది, కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. భారతీయులను అవమానించే నాయకులు ఉన్న దేశం నుంచి వస్తున్న టెక్నాలజీని మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? ఆత్మనిర్భర్ భారత్ ఇది కేవలం వస్తువుల తయారీకే పరిమితం కాకూడదు. ఇది సాఫ్ట్‌వేర్, డిజిటల్ రంగాల్లో కూడా ప్రతిబింబించాలి.
చివరగా, అధ్యక్షుడు ట్రంప్ గారూ.. వినండి! మీరు నిర్మిస్తున్న గోడలు మనుషులను వేరు చేయవచ్చు కానీ మేధస్సును ఆపలేవు. అమెరికా తన వినాశనాన్ని తనే కోరుకుంటుందని మీ వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. భారతీయులు లేని అమెరికా ఒక శూన్యం. ఇకనైనా మన భారతీయ యువత ఆలోచించాలి. ఎన్నాళ్లు పరాయి దేశానికి ఊడిగం చేస్తాం? మన మేధస్సు మన దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. విదేశీ యాప్‌లను బహిష్కరిద్దాం.. స్వదేశీ పరిజ్ఞానాన్ని వెలిగిద్దాం. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే అమెరికా కల మనకు వద్దు! భారతీయ మేధస్సు.. ప్రపంచానికి దిక్సూచి కావాలి.     

-  కంచర్ల యాదగిరిరెడ్డి, Managing Editor, సాక్షి టీవీ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement