రీగన్‌ను కాల్చిందీ.. ఆ హోటల్లోనే | Reagan assassination attempt occurred at same hotel as Correspondents Dinner shooting | Sakshi
Sakshi News home page

రీగన్‌ను కాల్చిందీ.. ఆ హోటల్లోనే

Apr 27 2026 1:18 AM | Updated on Apr 27 2026 1:18 AM

Reagan assassination attempt occurred at same hotel as Correspondents Dinner shooting

కాల్పులు అనంతరం రీగన్‌ను  ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం (ఫైల్‌) 

45 ఏళ్ల క్రితం ఘటన

వాషింగ్టన్‌: నలభై ఐదు సంవత్సరాల క్రితం కాల్పుల ఘటన నుంచి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ అదృష్టవశాత్తు బయటపడిన అదే హోటల్‌లో ట్రంప్‌పై హత్యాహత్నం జరగడంతో వాషింగ్టన్‌ నగరంలోని ‘హిల్టన్‌’ హోటల్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 1981 మార్చి 30వ తేదీన రీగన్‌పై జరిగిన కాల్పుల ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆరోజు హోటల్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొని బయటికొచ్చి లిమోసిన్‌ కారు ఎక్కేందుకు వెళ్తుండగా దూరంగా నిలబడిన జాన్‌ హింక్లీ జూనియర్‌ అనే వ్యక్తి ఒక్కసారిగా రివాల్వర్‌తో బుల్లెట్ల వర్షం కురిపించాడు. 

1.7 సెకన్ల వ్యవధిలో ఆరు బుల్లెట్లు కాల్చాడు. వాటిలో ఐదు అధ్యక్షుడు రీగన్‌సమీపంలోని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ జేమ్స్‌ బ్రాడీ, ఒక పోలీస్‌ ఆఫీసర్, ఒక సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌కు తగిలాయి. కానీ ఒక బుల్లెట్‌ మాత్రం ఎడమ చేతి కిందనుంచి నేరుగా రీగన్‌ ఛాతిలోకి దూసుకెళ్లింది. దీంతో ఎడమ ఊపిరితిత్తికి రంధ్రంపడింది. కాల్పుల ఘటనతో హుతాశులైన పోలీసులు వెంటనే రీగన్‌ను అదే లిమోసిన్‌ కారులో సమీప జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీ బోధనాస్పత్రికి తరలించారు. 

శస్త్రచికిత్స ద్వారా బుల్లెట్‌ను తొలగించడంతో రీగన్‌ బతికిపోయారు. కాల్పులు జరిపిన జాన్‌ హింక్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాల్పులు జరిపిన హింక్లీని మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని అతని లాయర్లు కోర్టులో వాదించారు. దీంతో 1982 జూన్‌లో అతడిని కఠినకారాగార శిక్ష నుంచి తప్పించారుగానీ నిర్బంధ కేంద్రంలో బంధించారు. ఏళ్లతరబడి వాదోపవాదనల తర్వాత 2016లో అతడిని సెయింట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రి మానసికరోగుల విభాగం నుంచి విముక్తుడిని చేశారు. చిట్టచివరకు 2022లో అతడిపై ఉన్న నేరాభియోగాలను పూర్తిగా ఎత్తేసి స్వేచ్ఛగా ఎక్కడైనా జీవించే హక్కు కల్పించారు. 

‘ట్యాక్సీ డ్రైవర్‌’ సినిమా అందాల టీనేజీ హీరోయిన్‌ జోడీ ఫాస్టర్‌ మనసును గెల్చుకోవాలనే ఆత్రుతలో హింక్లీ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని దర్యాప్తు అధికారులు తేల్చారు. హింక్లీ దాడిచేసిన హోటల్‌ కావడంతో చాన్నాళ్లు ఈ హోటల్‌ను ‘వాషింగ్టన్‌ హిల్టన్‌’ పేరుకు బదులు హింక్లీ హిల్టన్‌ అని పిలిచారు.  అలెన్‌ గతంలో ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) టీ–షర్ట్‌ను ధరించిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఆయనకు ఇజ్రాయెల్‌తో సంబంధం ఉందా? దాడిలో విదేశాల హస్తం ఉందా ? అనే కొత్త ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్‌ నుంచి ఎలాంటి ఖండనలూ, స్పందనలూ వెలువడలేదు.  
 

Advertisement
 
Advertisement
Advertisement