బెర్లిన్: శాంతి చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని.. పశ్చిమాసియా యుద్ధంపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపాలని ఇప్పటికే ఇరుదేశాలను ప్రధాని మోదీ కోరారని గుర్తు చేశారు. బెర్లిన్(జర్మనీ)లోని భారత రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడంలో న్యూఢిల్లీ తన వంతు పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.
పశ్చిమాసియా సంక్షోభంలో భారతదేశానికి ఏదైనా పాత్ర ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ రేపు ఒక సమయం రావచ్చు.. అప్పుడు భారత్ ఈ విషయంలో తన పాత్రను పోషించి విజయం సాధించడం కూడా సాధ్యమేనని తేల్చిచెప్పారు. ‘‘యుద్ధాన్ని ముగించాలని ప్రధాని మోదీ రెండు వైపులా విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన విషయాల్లో మా ప్రధానికి చాలా సమతుల్యమైన దృక్పథం ఉంది’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
కాగా, ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమంపై తలెత్తిన విభేదాల కారణంగా పాకిస్థాన్‌లో జరగాల్సిన ఇరాన్-అమెరికా రెండో రౌండ్ శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ పొడిగింపును ప్రకటించారు. ఇరుపక్షాలను తిరిగి చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన అభ్యర్థన మేరకు, ఇరాన్ నాయకులు ఒక ఏకీకృత ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులను వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫామ్‌లో రాసుకొచ్చారు.
అయితే, ఈ కాల్పుల విరమణ పొడిగింపును ఇరాన్ త్రోసిపుచ్చింది. ఇది అకస్మాత్తుగా దాడి చేయడానికి సమయాన్ని పొందేందుకు పన్నుతున్న కుట్రగా ఇరాన్ అభివర్ణించింది. ఓడిపోయే పక్షం షరతులు విధించలేదు. దిగ్బంధం కొనసాగితే దానికి సైనికపరమైన సమాధానం తప్పదంటూ ఇరాన్ ప్రతినిధి మహదీ మొహమ్మదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.


