800 కోట్ల మంది లక్ష ఏళ్లు బతకొచ్చు!

Moon top layer alone has enough oxygen to sustain 8 billion people for 100,000 years - Sakshi

చంద్రుడి ఉపరితలంపై సమృద్ధిగా ప్రాణవాయువు

ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ వెల్లడి

లిస్మోర్‌(ఆస్ట్రేలియా):  భూమికి ఉపగ్రహమైన చంద్రుడిపై మానవ మనుగడకు ఆస్కారం ఉందా? అనే అంశంపై దశాబ్దాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మనిషి జీవించాలంటే శ్వాసించాల్సిందే. అందుకు ప్రాణవాయువు(ఆక్సిజన్‌) కావాలి. ఆ ప్రాణవాయువు చందమామపై ఇబ్బడిముబ్బడిగా ఉందని ఆస్ట్రేలియా స్సేస్‌ ఏజెన్సీ చెబుతోంది. అయితే, అది గాలి రూపంలో లేదని, చంద్రుడి ఉపరితలంపై వివిధ రాళ్లు, ఖనిజాల్లో నిక్షిప్తమై ఉన్నట్లు గుర్తించింది.

చందమామపై రాళ్లను సేకరించి, వాటినుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్రక్రియపై ఇప్పుడు ఆస్ట్రేలియా దృష్టి పెట్టింది. ఇందుకోసం ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా తయారు చేసే రోవర్‌ను చంద్రుడిపైకి పంపిస్తారు. ఈ రోవర్‌ సాయంతో చంద్రుడిపై రాళ్లను సేకరించి, భూమిపైకి తీసుకొస్తారు. వాస్తవానికి చందమామపై వాతావరణం లేదు. రాళ్లు, దుమ్ము ధూళితోపాటు సిలికా, అల్యూమినియం, ఐరన్, మెగ్నీషియం ఆక్సైడ్‌ ఉన్నాయి.

వీటన్నింటిలో ఆక్సిజన్‌ సమృద్ధిగా ఉందని ఆస్ట్రేలియా స్పేస్‌ ఏజెన్సీ పరిశోధకులు చెబుతున్నారు. అది ఎంతమేరకు ఉందన్న దానిపై ఒక అంచనాకొచ్చారు. ఉపరితలం నుంచి కేవలం 10 మీటర్ల లోతులో ఒక క్యూబిక్‌ మీటర్‌ రాళ్లలో 630 కిలోల ఆక్సిజన్‌ ఉందని పేర్కొంటున్నారు. మనిషి ఒకరోజు జీవించాలంటే 800 గ్రాముల ఆక్సిజన్‌ను శ్వాసించాలి. 630 కిలోల ఆక్సిజన్‌తో ఒకరు రెండేళ్లకుపైగానే జీవించవచ్చు. ఈ లెక్కన 800 కోట్ల మంది లక్ష ఏళ్లపాటు జీవించేందుకు అవసరమైన ఆక్సిజన్‌ చంద్రుడిపై 10 మీటర్ల లోతుదాకా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే, చంద్రుడిపై ఉన్న ప్రాణవాయువును ఎంత సమర్థంగా వెలికితీసి, వాడుకుంటామన్న దానిపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top