అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు ద్వారాలు తెరిచిన ఇరాన్
స్వాగతించిన అమెరికా
ఊపిరిపీల్చుకున్న దేశాలు
ఊపందుకున్న స్టాక్‌మార్కెట్లు
దిగొచ్చిన ముడి చమురు ధరలు
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ ప్రపంచదేశాలకు శుక్రవారం శుభవార్త విన్పించింది. పర్షియన్ గల్ఫ్ జలాల మీదుగా పయనిస్తే నౌకలను తగలబెడతామనే బెదిరింపులకు స్వస్తిపలికి ఇకపై అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు హార్మూజ్ జలసంధిని బార్లా తెరుస్తున్నట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఈ వార్త వినగానే ప్రపంచదేశాలు చమురుసంక్షోభం బారి నుంచి బయటపడ్డామని ఊపిరిపీల్చుకున్నాయి. స్టాక్‌మార్కెట్లకు సైతం కొత్త ఊపొచ్చింది. అమెరికా స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అనూహ్య డిమాండ్‌తో ముందస్తు కొనుగోళ్లతో ముడిచమురు ధర కొండెక్కగా తాజా వార్తతో ధర నేలచూపులు చూసింది.
మార్చి నెలలో గరిష్టంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 119 డాలర్లకు పెరగ్గా శుక్రవారం శుభవార్త తర్వాత ఒక్కసారిగా 90 డాలర్ల దిగువకు దిగొచ్చింది. ధర శుక్రవారం ఉదయం 98 డాలర్లు ఉండగా హార్మూజ్ వార్త వెలువడగానే 10 శాతం పడిపోయి 88 డాలర్లకు చేరుకుంది. హార్మూజ్ గుండా నౌకల రాకపోకలు మొదలుకానున్నాయని ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. ‘‘జలసంధిని తెరుస్తున్నామని ఇప్పుడే ఇరాన్ ప్రకటించింది. హార్మూజ్ గుండా రాకపోకలు ఊపందుకోనున్నాయి. థాంక్యూ. అయితే హార్మూజ్‌పై అమెరికా ఆధిపత్యం కొనసాగుతుంది. హార్మూజ్ గుండా ఇరాన్, దాని మిత్రదేశాల నౌకల రాకపోకలను అడ్డుకుంటాం.
ఇరాన్‌తో శాంతి ఒప్పందం 100 శాతం పూర్తయి, అమల్లోకి వచ్చేదాకా, యుద్ధం ముగిసేదాకా ఇరాన్‌కు చెందిన నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయి. ఇరాన్‌తో చర్చల్లో ఇప్పటికే చాలా అంశాల్లో ఏకాభిప్రాయం సాధించాం. లెబనాన్ ప్రస్తావన, దానితో సంబంధం లేకుండానే ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాం. అమెరికా సాయంతో ఇరాన్ జలసంధిలోని పాత సముద్ర మందుపాతరలను తొలగిస్తోంది. మరోసారి హార్మూజ్‌ను మూసేయబోమని ఇరాన్ మాకు హామీ ఇచ్చింది. ప్రపంచానికి వ్యతిరేకంగా హార్మూజ్‌ను ఆయుధంగా ఇరాన్ ఉపయోగించడం సాధ్యపడదు’’అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకిరావడంతో హార్మూజ్‌ను తెరుస్తున్నాం.
తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉండే ఈ పది రోజులపాటే హార్మూజ్ తెరచి ఉంటుంది’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. హార్మూజ్‌ను తెరవాలంటే తొలుత లెబనాన్‌పై కాల్పులు ఆపేయాలన్న డిమాండ్‌కు ఇజ్రాయెల్, అమెరికా తలొగ్గడంతోనే హార్మూజ్‌ను తెరుస్తున్నట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. దీనిపై అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. పాకిస్తాన్ సాయుధబలగాల సారధి, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ టెహ్రాన్‌లో ఇరాన్ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపిన మరుసటిరోజే హార్మూజ్‌పై ఇరాన్ కీలక ప్రకటన వెలువర్చడం గమనార్హం.

క్షేమంగా రవాణాపై సమావేశం
మరోవైపు హార్మూజ్ గుండా వెళ్లే నౌకలకు పూర్తి రక్షణ కల్పించే లక్ష్యంతో ఉమ్మడిగా పనిచేయాలని డజన్లకొద్దీ దేశాలు కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం పారిస్‌లోని దేశాధ్యక్షభవనంలో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీసహా 30 దేశాల అధినేతలు, 20 అంతర్జాతీయ కూటముల అధ్యక్షులు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి జర్మనీ చాన్స్‌లర్ ఫెడ్రిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతదితరులు స్వయంగా, ఇతరులు వర్చువల్‌గా హాజరయ్యారు.
నాటోపై ట్రంప్ ఆగ్రహం
‘‘ఇప్పుడు హార్మూజ్ జలసంధి వివాదం ముగిసిపోయింది. అంతా అయిపోయాక ఇప్పుడు తీరిగ్గా నాటో కూటమి నుంచి నాకు ఫోన్‌కాల్ వచ్చింది. మీకేమైనా సాయం కావాలంటే చేసిపెడతామని అడిగారు. మీ సాయం నాకు అస్సలు అక్కర్లేదని ముఖంమీదే చెప్పేశా. అవసరమైనప్పుడు సాయపడకుండా ముఖంచాటేశారు. నాటో కేవలం కాగితం పులి’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చించి ఇరాన్‌ను పాక్ ఒప్పించిందని ట్రంప్ ఆ దేశాన్ని పొగిడారు. ‘‘పాకిస్తాన్‌కు, పాక్ గొప్ప ప్రధానికి, ఫీల్డ్ మార్షల్‌కు కృతజ్ఞతలు. ఇద్దరూ గొప్ప వ్యక్తులు’’అని ట్రంప్ ఒక పోస్ట్‌చేశారు.


