న్యూఢిల్లీ: అమెరికా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని అందుకే హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న నౌకలపై ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. దీంతో భారత్‌లో ఇంధన సరఫరా భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో 60 రోజుల వరకు చమురు, పెట్రోల్, డీజిల్,ఏటీఎఫ్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ, దీర్ఘకాలిక అంతరాయం వస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్ తన మొత్తం చమురు అవసరాల్లో 85శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా, యూఏఈ వంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచే వస్తుంది. ఈ సరఫరా ప్రధానంగా హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుంది. కాబట్టి ఆ మార్గం మూసుకుపోతే సరఫరా అంతరాయం, రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు అన్నీ పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల దేశీయ ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
భారత్ గత కొన్నేళ్లుగా ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. రెడ్ సీ–సూయజ్ కాలువ మార్గం, బాబ్ ఎల్-మండెబ్ జలసంధి వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తోంది. అదనంగా, అమెరికా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా సరఫరా పొందుతోంది.
ప్రస్తుతం భారత్‌కి 60 రోజుల చమురు నిల్వలు, 50 రోజుల ఎల్‌ఎన్‌జీ నిల్వలు, 40 రోజుల ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి నెలలో ప్రభుత్వం తెలిపిన ప్రకారం, మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు వరకు ఉంది.
ప్రస్తుతం నిల్వలు ఉన్నప్పటికీ హర్మూజ్ జలసంధి దీర్ఘకాలం మూసుకుపోతే భారత్‌కి ఇంధన సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణ కష్టమవుతుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త సరఫరా ఒప్పందాలు, వ్యూహాత్మక నిల్వలు పెంపు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


