అటు తిరిగి, ఇటు తిరిగి ఎఫ్‌బీఐ చీఫ్‌ మీదికి వచ్చింది! | Can Kash Patel survive this WHCD lapses | Sakshi
Sakshi News home page

అటు తిరిగి, ఇటు తిరిగి ఎఫ్‌బీఐ చీఫ్‌ మీదికి వచ్చింది!

Apr 28 2026 4:09 AM | Updated on Apr 28 2026 4:48 AM

Can Kash Patel survive this WHCD lapses

ఎఫ్‌బీఐ (ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌)కి అమెరికాలో ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అమెరికాలో ఉగ్రవాదం, గూఢచర్యం, అంతర్గత భద్రతా ముప్పులను ఎదుర్కోవడంలో ఎఫ్‌బీఐ కీలక పాత్ర పోషిస్తుంది. అవినీతి, సైబర్ నేరాలు, మాఫియా, పౌరహక్కుల ఉల్లంఘనలు వంటి 200 కంటే ఎక్కువ రకాల ఫెడరల్ నేరాలను ఎఫ్‌బీఐ పరిశీలిస్తుంది.

సైబర్ దాడులు, ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ భద్రతా సమస్యలను ఎదుర్కోవడానికి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. రాష్ట్ర, స్థానిక, అంతర్జాతీయ పోలీస్ సంస్థలతో కలిసి పనిచేసి, నేరాల నియంత్రణలో సమన్వయం కల్పిస్తుంది. మొత్తానికి, ఎఫ్‌బీఐ అమెరికాకు భద్రతా కవచంగా, అలాగే ఫెడరల్ నేరాల పరిశోధన సంస్థగా పనిచేస్తుంది. 

అటువంటి ఎఫ్‌బీఐకు చీఫ్‌ అంటే ఎలా ఉండాలి? ఎంతో సమర్థుడై ఉండాలి. ఏదైనా ముప్పు తలెత్తినప్పుడు ముందు నిలబడి ఎదుర్కోవాలి. కానీ, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి కెమెరాకు దొరికిపోయారు. వాషింగ్టన్‌ హిల్టన్‌ హోటల్‌లో ఇటీవల నిర్వహించిన  వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాష్‌ పటేల్‌ హాయిగా కుర్చీకే అతుక్కుపోయి కూర్చుండిపోయారు.

దీంతో ఎఫ్‌బీఐ చీఫ్‌ పదవిలో కాష్‌ పటేల్ నిలదొక్కుకోగలరా? వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేళ భద్రతా లోపాలు, నిందితుడి స్టేట్‌మెంట్‌ వంటివాటి వల్ల కాష్‌ పటేల్‌ పదవి వీడాల్సిందేనా? అన్న ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తదుపరి తొలగించే వారి లిస్టులో.. కాష్‌ పటేల్‌ ఉండవచ్చని ఒక సీనియర్ వైట్‌హౌస్ అధికారి ఇటీవలే మీడియాకు తెలిపారు. 

పటేల్‌ను పదవి నుంచి తొలగించడం దాదాపు ఖాయమని, “ఎప్పుడు తొలగిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న?” అని వ్యాఖ‍్యానించారు. అసలు కాష్‌ పటేల్‌ను తొలగిస్తారన్న ప్రచారం చాలా కాలంగా ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు ఆ ప్రచారం మరింతగా పెరగడానికి కారణాలు ఏంటి? మీడియాలో కాష్‌ పటేల్‌పై ప్రతికూల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. 

ఆయన పనితీరుతో పాటు నిర్ణయాలు, వ్యక్తిగత అంశాలపై విమర్శలు పెరిగాయి. కేబినెట్ కార్యదర్శి దృష్టిలో ఇది మంచిది కాదు. ఇటీవల వాషింగ్టన్ హిల్టన్‌లో జరిగిన భద్రతా లోపం ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్‌ పటేల్ విషయంలో రాజకీయ చర్చగా మారుతోంది. నిందితుడు రాసిన “ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్” లేఖలో పలువురు ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ, పటేల్ పేరు మాత్రం లేదన్న విషయం తెలిసిందే.

కాల్పుల ఘటన తర్వాత ఏం జరిగింది?
కాల్పుల ఘటన అనంతరం పలు వీడియోలు ఆన్‌లైన్‌లో కనపడ్డాయి. ఒక వీడియోలో నిందితుడు అలెన్ హోటల్‌లోకి పరుగెత్తాడు. తర్వాత కాల్పుల శబ్దం వినిపించింది. మరో వీడియోల్లో అతిథులు టేబుళ్ల కింద దాక్కోవడం, భద్రత సిబ్బంది వేగంగా కదలడం, అధికారులను బయటకు తరలించడం కనిపించింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో కాష్‌ పటేల్ అయోమయంగా చుట్టూ చూస్తూ కుర్చీలో కూర్చుండిపోయారు. భద్రతా సిబ్బంది అతిథులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో వీడియోలో కాష్‌ పటేల్‌ అక్కడ ఏమీ జరగనట్లు అటూఇటూ తిరుగుతూ ఫోన్‌లో మాట్లాడారు. ఆ సమయంలో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ప్రజలను బయటకు తీసుకెళ్తుండగా కాష్‌ పటేల్‌ ప్రశాంతంగా కనిపించారు.

కాష్‌ పటేల్‌ ఆ పదవిలో కొనసాగుతారా?
వైట్ హౌస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దాడికి ముందు అలెన్ తన కుటుంబానికి ఒక లేఖ పంపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ పత్రంలో తాను “ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్” అని పేర్కొంటూ, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుంటానని తెలిపాడు.

అయితే “ప్రభుత్వ అధికారులు (మిస్టర్ పటేల్ మినహా)” అని పేర్కొన్న ఒక వాక్యం ప్రత్యేకంగా చర్చకు దారి తీసింది. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దాని వెనుక ఉద్దేశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఆ పత్రంలో ట్రంప్ వ్యతిరేక, క్రైస్తవ వ్యతిరేక అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

ఈ ఘటనకు ముందు కూడా పటేల్‌పై పలు భద్రతా అంశాలపై విమర్శలు ఉన్నాయి. 2024 చివర్లో, 2026 మార్చిలో ఆయన వ్యక్తిగత ఈమెయిల్ ఖాతాలపై ఇరాన్ మద్దతు ఉన్న హ్యాకర్ల దాడులు జరిగాయని నివేదికలు వెలువడ్డాయి. ఇది సైబర్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. కాష్‌ పటేల్‌ వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన వాటిని ఖండించారు. ఈ ఆరోపణలపై ఆయన పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement