కొలంబియాలో విషాదం చోటు చేసుకుంది. టేకాఫ్ సమయంలో ఆర్మీ విమానం కుప్పకూలింది. పెరు సరిహద్దు సమీపంలో టేకాఫ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విమానంలో 110 మంది సైనికులున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
కొలంబియా సైన్యానికి చెందిన సి-130 అనే జెట్ అమెజాన్ ప్రాంతంలోని ప్యూర్టో లెగుయిజామో నుండి సైనికులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఎప్పుడూ జరగకూడని భయంకరమైన ప్రమాదం అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎయిర్‌ఫోర్స్ చీఫ్ జనరల్ మాట్లాడుతూ ప్రయాణ సమయంలో విమానంలో మొత్తం 125 మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. వారిలో పెద్దసంఖ్యలో సైనికులున్నారని తెలిపారు. కాగా ఇప్పటివరకు వారిలో 57 మందిని గాయాలతో రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యపై ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు.


