అతడో ఉన్మాది: ట్రంప్‌  | Allen is a maniac says donald Trump | Sakshi
Sakshi News home page

అతడో ఉన్మాది: ట్రంప్‌ 

Apr 27 2026 1:09 AM | Updated on Apr 27 2026 6:27 AM

Allen is a maniac says donald Trump

వాషింగ్టన్‌: హిల్టన్‌ హోటల్లో కాల్పులకు తెగబడ్డ దుండగుడు అలెన్‌ తన యంత్రాంగంలోని అధికారులను లక్ష్యం చేసుకున్నట్టు తెలుస్తోందని ట్రంప్‌ అన్నారు. దీనికి సంబంధించి అలెన్‌ కుటుంబం శనివారం విందుకు ముందే కనెక్టికట్‌లో పోలీసులకు సమాచారం కూడా ఇచ్చినట్టు వివరించారు. కాల్పుల అనంతరం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా భేటీ, తర్వాత ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు చెప్పుకొచ్చారు. ‘‘దుండగుడు ఓ ఉన్మాది. చాలా ఆయుధాలతో హోటల్‌ లాబీలో కాల్పులకు దిగాడు. 

సీక్రెట్‌సర్వీసు సిబ్బంది అడ్డుకోగా ఒక అధికారిపై అత్యంత సమీపం నుంచి శక్తిమంతమైన తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. సిబ్బంది సాహసోపేతంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారి సాహసం ప్రశంసనీయం’’ అన్నారు. మిమ్మల్నే లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగిందని భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా ‘అనుకుంటాను’ అని ట్రంప్‌ బదులిచ్చారు. హిల్టన్‌ హోటల్‌ వద్ద భద్రతా సక్రమంగా లేదని, అది సురక్షితమైన భవనం కాదని అభిప్రాయపడ్డారు. ‘‘హోటల్‌లో కాల్పుల శబ్దాన్ని మొదట తప్పుగా అర్థం చేసుకున్నా. పల్లెం లాంటిది కింద పడడం వల్ల వచ్చిన శబ్దంగా భావించా’’ అని చెప్పారు. 
 
లింకన్‌పై జరిగినట్లుగానే..  
హత్యల గురించి తానెంతో అధ్యయనం చేశానని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అత్యధిక ప్రభావం చూపే శక్తివంతులనే లక్ష్యంగా చేసుకుంటారని చెప్పారు. ప్రభావం చూపలేని వారి జోలికి ఎవరూ రారని అన్నారు. 1865లో జరిగిన అబ్రహం లింకన్‌ హత్యాకాండను ప్రస్తావించారు. లింకన్‌పై జరిగినట్లుగానే తనపైనా హత్యాయత్నాలు జరిగాయని వెల్లడించారు. రాజకీయాలను రేస్‌ కార్‌ డ్రైవింగ్, బుల్‌ రైడింగ్‌లతో పోల్చారు. 

‘‘రాజకీయాలు నిజంగా ప్రమాదకరమైన వృత్తి. ఇది చాలా ప్రమాదకరమన్న విషయం నాకెవరూ చెప్పలేదు. అమెరికా అధ్యక్ష పదవిని ఆశించడంలో ఉన్న రిస్క్‌ల గురించి మంత్రి మార్కో రూబియో ముందుగా నన్ను హెచ్చరించలేదు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు, ఇతర వీఐపీలకు భద్రతను కనీవిని ఎరగనంతగా కట్టుదిట్టం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తన భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ దపంతులు, కేబినెట్‌ సభ్యులు తదితరులంతా క్షేమంగా ఉన్నారంటూ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. పాత్రికేయుల విందు 30 రోజుల్లోగా మళ్లీ జరుగుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement