పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ ముదిరేలా కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒమన్ వైపు వెళ్తున్న నౌకలపై ఇరాన్ దాడులకు దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని ఇరాన్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అమెరికా మాత్రం స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించొద్దని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో బుధవారం హర్ముజ్‌లో వెళ్తున్న కంటైనర్ షిప్‌లపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డు నౌకలు కాల్పులు జరిపాయి. ఈ దాడుల్ని బ్రిటన్ ఆర్మీ ధృవీకరించింది. మొత్తం మూడు నౌకలపై దాడులు జరిగాయని.. గ్రీక్, పనామా, లైబీరియా రిజిస్ట్రేషన్ నౌకలుగా వాటిని గుర్తించారు.
తొలుత.. ఈ ఉదయం గ్రీక్ ఆపరేటెడ్ కంటైనర్ షిప్‌పై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే ఇరాన్ బలగాలు కాల్పులకు దిగాయి. దీంతో నౌక పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని.. సిబ్బంది క్షేమంగానే ఉన్నారని సమాచారం. ఆ వెంటనే పనామా, లైబీరియా షిప్‌లపై దాడి జరిగింది. దాడులను ధృవీకరించిన ఇరాన్ మీడియా.. హర్ముజ్ జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ప్రపంచ వర్తక వాణిజ్యానికి హర్ముజ్ జలసంధి కీలకమన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రూట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే.. కాల్పుల విరమణ కొనసాగుతున్నా హర్ముజ్‌లో తమ బ్లాకేడ్(దిగ్బంధం) కొనసాగుతుందని అమెరికా అంటోంది. ఈ క్రమంలో టౌసా అనే వాణిజ్య నౌకను సీజ్ చేసింది. ఇది యుద్ధ చర్యేనంటున్న ఇరాన్.. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగడం పరిస్థితిని మరింత తీవ్రతరంగా మార్చే అవకాశం లేకపోలేదు.


