అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ది అసలు నోరేనా? అని అంటోంది ఇరాన్ మీడియా. పశ్చిమాసియా యుద్ధంపై వైట్‌హౌజ్ వేదికగా ఒక్క గంటలో ఆయన ఏడు ప్రకటనలు చేశారు. అయితే అవన్నీ అబద్ధాలేనని ఇరాన్ అంటోంది. ఇంతకీ ఏ ఏడు ఏంటంటే..
ఇరాన్-అమెరికా మధ్య హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)పై ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా నౌకా దళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తాము హార్ముజ్‌ను మూసివేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘలీబాఫ్.. డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించారు. ఈ దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందంటూ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఎక్స్ వేదికగా స్పందించిన ఘలీబాఫ్.. హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు ఇరాన్ అనుమతితోనే జరుగుతుందని స్పష్టం చేశారు. దిగ్బంధనం కొనసాగితే, హార్ముజ్ జలసంధి ఎంతమాత్రం తెరిచి ఉండదంటూ ఆయన స్పష్టం చేశారు. "వారు ఈ అబద్ధాలతో యుద్ధంలో గెలవలేదు. చర్చల్లో కూడా ఎక్కడికీ వెళ్లలేరు. జలసంధి తెరిచి ఉందా లేదా అనేది క్షేత్రస్థాయి పరిస్థితులు నిర్ణయిస్తాయి కానీ సోషల్ మీడియా కాదు. ట్రంప్ ఒక గంటలో ఏడు ఆరోపణలు చేశారని.. అవన్నీ అబద్ధాలు’’ అంటూ ఘలీబాఫ్ కొట్టిపారేశారు. అయితే, ఆ ఏడు అవాస్తవాలు ఏమిటనేది ఆయన స్పష్టంగా వివరించలేదు.
లెబనాన్‌లో కాల్పుల విరమణ కాలంలో అన్ని వాణిజ్య నౌకల కోసం హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంటుందని ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఇరాన్ యుద్ధం కారణంగా దాదాపు రెండు నెలల పాటు మూతబడటంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు, సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఇరాన్ దీనిని తెరిచినప్పటికీ, వాణిజ్య నౌకలు భద్రతా హామీల కోసం వేచి చూస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
అయితే, ఇరాన్ యుద్ధంపై గతంలో ట్రంప్ ఏడు స్టేట్‌మెంట్లను పరిశీలిస్తే.. అవన్నీ అబద్ధాలేనని తేలింది. హార్ముజ్ పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ చెప్పడాన్ని తప్పుబట్టిన ఇరాన్.. మా అనుమతితో మాత్రమే తెరుస్తామని చెబుతోంది. నావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్ వ్యాఖ్యలు చేయగా.. ఇది తప్పుదారి పట్టించే ప్రకటన అంటూ అమెరికా ఒత్తిడి కొనసాగుతుందని ఇరాన్ చెప్పింది. ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్ వ్యాఖ్యలను ఘలీబాఫ్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ యుద్ధంలో నిలబడిందని పేర్కొన్నారు.
అలాగే, చర్చలు దాదాపు పూర్తయ్యాయని ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్.. యురేనియం తరలింపు వంటి అంశాలు ఎప్పుడూ చర్చల్లో లేవని స్పష్టం చేసింది. ఇరాన్ యురేనియం అమెరికాకు తరలిస్తుందని ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని పేర్కొంది. హార్ముజ్ ఎప్పటికీ తెరిచి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్ ఇస్తూ.. ఆంక్షలు కొనసాగితే హార్ముజ్‌ను మూసివేస్తామని హెచ్చరించింది. అమెరికా–ఇరాన్ ఒప్పందం త్వరగా కుదురుతుందని ట్రంప్ చెప్పగా.. ఇది అవాస్తమంటూ పేర్కొన్న ఇరాన్.. చర్చలు ఇంకా క్లిష్టంగా ఉన్నాయని తెలిపింది.
- హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ చెప్పారు.. మా అనుమతితోనే తెరుస్తామని ఇరాన్ చెప్పింది
- నావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్ అన్నారు.. అమెరికా బ్లాకేడ్ కొనసాగుతోందని ఇరాన్ అంటోంది
- ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్ అన్నారు.. తాము యుద్ధంలో నిలబడ్డామని ఇరాన్ స్పష్టం చేసింది
- చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని ట్రంప్ చెప్పుకొచ్చారు.. ఆయన చెప్పిన అంశాలపై చర్చలు జరగలేదని ఇరాన్ చెబుతోంది
- శుద్ధి యురేనియం ఇరాన్ అమెరికాకు తరలిస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని ఇరాన్ అంటోంది
- హర్ముజ్ ద్వారా అమెరికాకు ఫ్రీ చమురు రాబోతోందని.. ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ చెప్పడం.. అదంతా అబద్ధమేనని ఇరాన్ ప్రకటించింది
- డీల్ త్వరలోనే అని ట్రంప్.. చర్చలు క్లిష్టదశలో ఉన్నాయని ఇరాన్ స్పష్టీకరణ


