తీవ్రమైన వేడి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రమాదం అంచుకు నెడుతోంది. ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో వడగాలులు తీవ్రతరం అవుతుండటంతో పంటలు, పశుసంపదపై ఒత్తిడి పెరుగుతోంది. యావత్ సమాజం ఉద్గారాలను తగ్గించుకునేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటే తప్ప ఆహార, వ్యవసాయ వ్యవస్థలకు, 120 కోట్లకు పైగా ప్రజల జీవనోపాధులు, ఆహార భద్రత పెను ముప్పును ఎదుర్కోక తప్పదని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) హెచ్చరించాయి. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా బుధవారం ఐక్యరాజ్యసమితి సంస్థలు ఉమ్మడి నివేదికను విడుదల చేశాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా సంభవిస్తున్న వడగాలులు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆహారోత్పత్తిని దెబ్బతింటున్నది. తీవ్రమైన వేడి కారణంగా ఇప్పటికే పనులు చేసుకోలేని పరిస్థితులు పెరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం 50 వేల కోట్ల పని గంటలు కోల్పోతున్నామని, ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ఈ ప్రభావాలు మరింత తీవ్రతరం కానున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది.
పశువులు, పంటలకు కష్టం
వ్యవసాయ పద్ధతులన్నింటిలోనూ అధిక వేడి ప్రభావాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత పెరిగినప్పటి నుంచే మొక్కజొన్న, సోయా వంటి అనేక ప్రధాన పంటలదిగుబడులు తగ్గడం మొదలవుతోంది. దీనివల్ల పంట మొక్కలు బలహీనపడి, ఉత్పాదకత తగ్గుతోంది. ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటినప్పటి నుంచే పశువులు, ముఖ్యంగా పందులు, కోళ్లు ఒత్తిడికి గురవుతుంటాయి. వేడిని తట్టుకోలేనందున వాటి పెరుగుదల తగ్గిపోతుంది.
పాల దిగుబడి తగ్గుతుంది. తీవ్రమైన సందర్భాల్లో అవయవ వైఫల్యం కూడా సంభవిస్తుందని నివేదిక హెచ్చరించింది. సముద్రాలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తున్నాయి. దీనివల్ల సముద్ర జలాల్లోని చేపలు ఒత్తిడికి గురవుతున్నాయి. తీవ్రమైన వేడి కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలిగించి, కార్చిచ్చుల ప్రమాదాన్ని పెంచుతుండటంతో అడవులు కూడా ప్రభావితమవుతున్నాయి.
తీవ్రమైన వేడి నేరుగా నష్టపరచటమే కాకుండా ఇతర పర్యావరణ సమస్యలను సైతం ప్రేరేపిస్తుంది. కరువులను ప్రేరేపించగలదు, నీటి కొరతను మరింత తీవ్రతరం చేయగలదు, కార్చిచ్చు ప్రమాదాలను పెంచగలదు. అంతేకాదు, తెగుళ్లు, వ్యాధుల వ్యాప్తిని వేగవంతం చేయగలదు. ఇలాంటివన్నీ కలిసి మొత్తం పర్యావరణ వ్యవస్థలపై పెను ప్రభావం చూపే స్థితికి చేర్చుతాయని నివేదిక తెలిపింది.
పనులు చెయ్యలేని రోజులు..
తీవ్రమైన వేడి ఒత్తిడి ప్రభావాలు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రంగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పంటలు, పశువులకే కాదు మనుషులకు కూడా నష్టం అంతే తీవ్రంగా ఉంది. దక్షిణాసియా, సహారా ఉప–ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఆరుబయట పనులు చేయడానికి వీలుకాని రోజుల సంఖ్య సంవత్సరానికి 250కి పెరగొవచ్చు. ఇది లక్షలాది మంది వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ప్రమాదంలో పడేసి, ఆహార ఉత్పత్తిని దెబ్బతీస్తుందని నివేదిక హెచ్చరించింది.
ఉదాహరణకు, 2025లో కిర్గిజ్‌స్థాన్‌లో సంభవించిన వడగాడ్పుల కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 10 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి. ఇది ధాన్యం దిగుబడుల్లో 25 శాతం తగ్గుదలకు కారణమవ్వటానికే కాకుండా, ఎడారి మిడతల దండును ప్రేరేపించి, నీటిపారుదల సామర్థ్యాన్ని కూడా తగ్గించింది.
ఇతర ప్రాంతాలలో, 2023 మరియు 2024లో బ్రెజిల్‌లో దీర్ఘకాలం పాటు కొనసాగిన వేడి మరియు కరువు పరిస్థితులు సోయాబీన్ దిగుబడులను 20 శాతం వరకు తగ్గించాయి , అదే సమయంలో 2021లో ఉత్తర అమెరికా అంతటా సంభవించిన తీవ్రమైన వడగాలులు పండ్ల పంటలలో గణనీయమైన నష్టాలకు మరియు అటవీ అగ్నిప్రమాదాలలో తీవ్రమైన పెరుగుదలకు దారితీశాయి.
తక్షణ చర్యలు తీసుకోవాలి
అధిక వేడిని తట్టుకునే పంట రకాలను తయారు చేసుకోవటం, నాట్లు వేసే సమయాలను వేడికి అనుగుణంగా సర్దుబాటు చేయటం, వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడం వంటి తక్షణ చర్యలతో నష్టనివారణకు గల అవకాశాలను అందిపుచ్చుకోవాలని పాలకులకు పిలుపునిచ్చింది.
పెరుగుతున్న వాతావరణ ప్రమాదాలను ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడటానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, బీమా, సామాజిక భద్రత వంటి ఆర్థిక సహాయ పథకాలను అందుబాటులోకి తేవటం కూడా చాలా కీలకం.
వ్యవసాయ భవిష్యత్తును పరిరక్షించడానికి, ప్రపంచ ఆహార భద్రత పరిరక్షణకు, వాతావరణ మార్పును తట్టుకునే శక్తిని పంటలకు పెంపొందించాలి. కర్బన ఉద్గారాలను భవిష్యత్తులో భారీగా తగ్గించుకోవటం కూడా అవసరమని ΄పాలకులకు ఎఫ్‌ఏఓ, ఐడబ్ల్యూఓ పిలుపునిచ్చాయి.
బలహీనతలు తీవ్రతరం
వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఆహార పంపిణీ వ్యవస్థల్లో పని పరిస్థితులను తీవ్రమైన వేడిమి అతలాకుతలం చేస్తోంది. వ్యవసాయ, ఆహార పంపిణీ వ్యవస్థల్లో ఇప్పటికే ఉన్న బలహీనతలను మరింత తీవ్రతరం చేసే ఒక ‘సంక్లిష్ట ప్రమాద కారకం’గా అధిక వేడి పనిచేస్తోందని ΄ాలకులు గుర్తించాలి.
– సెలెస్ట్ సౌలో, డైరెక్టర్ జనరల్, ప్రపంచ వాతావరణ సంస్థ
ఆహార భద్రతపై ఒత్తిడి
తీవ్రమైన వేడి పంటలు, పశుసంపద, మత్స్య సంపద, అడవులపై, అలాగే వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. ఆహార భద్రతపై ఒత్తిడిని పెంచుతోంది.
– క్యు డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఐక్యరాజ్యసమితి ఆహార–వ్యవసాయ సంస్థ
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడిడెస్క్
(చదవండి: World Banana Day: 'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!)


