Maha Shivaratri 2023: పండంటి ఆహారం.. వంటకు నిషేధం... పండ్లకు ఆహ్వానం !!

Maha Shivratri fasting - Sakshi

రేపే శివరాత్రి!  రోజంతా ఉపవసించాలి... నీరసించకూడదు.  వండ వద్దు... ఎండకు డస్సిపోనూ వద్దు.  పండంటి ఆహారంతో శక్తిని పుంజుకోవచ్చేమో!  వంటకు నిషేధం... పండ్లకు ఆహ్వానం !! 

దానిమ్మ రసం 
కావలసినవి: దానిమ్మ పండ్లు – 2 
తయారీ: దానిమ్మ పండ్లను కడిగి ఒక్కొక్క పండును నాలుగు భాగాలుగా కట్‌ చేయాలి. మొత్తం ఎనిమిది ముక్కలను వెడల్పాటి పాత్రలో వేసి ముక్కలు మునిగేటట్లు నీరు పోయాలి. ఇప్పుడు వేళ్లతో మృదువుగా గింజలను వేరు చేయాలి. గింజలు నీటి అడుగున చేరతాయి, వగరుగా ఉండే పలుచని తొక్క నీటి మీద తేలుతుంది. పై చెక్కు, లోపలి తొక్కలను తీసేసి నీటిని వడపోయాలి.

ఈ గింజలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ జ్యూస్‌ను అలాగే తాగవచ్చు లేదా వడపోసి తాగవచ్చు. వడపోయకుండా తాగినట్లయితే జీర్ణవ్యవస్థ చక్కగా శుభ్రపడుతుంది. దానిమ్మలోని తీపి సరిపోదనుకుంటే గింజలను గ్రైండ్‌ చేసేటప్పుడు రెండు ఖర్జూరాలను (గింజ తీసేసినవి) కలుపుకోవచ్చు. 

రెయిన్‌ బో ఫ్రూట్‌ సలాడ్‌ 
కావలసినవి: స్ట్రాబెర్రీలు – 2 కప్పులు (శుభ్రం చేసి సగానికి కట్‌ చేయాలి); తర్బూజ ముక్కలు – 2 కప్పులు; బ్లూ బెర్రీలు – కప్పు; కివీ పండ్లు – 2 (తొక్క తీసి పలుచగా ముక్కలు చేయాలి); బొప్పాయి పండు (ముక్కలు చేయాలి); రాస్ప్‌ బెర్రీలు – కప్పు 

తయారీ: ఈ ముక్కలను చక్కగా ఫొటోలో ఉన్నట్లు ఇంద్రధనుస్సు ఆకారంలో అమర్చాలి. ఫ్రూట్‌ సలాడ్‌ ప్లేట్‌ని ఇలా చూస్తే ఎవరికైనా ఒక ముక్క తినాలనిపిస్తుంది. మనకు అందుబాటులో ఉన్న అరటిపండు, యాపిల్, ఆరెంజ్, ద్రాక్ష వంటి పండ్లతోనూ సరదాగా ఇంద్ర ధనుస్సును అమర్చుకోవచ్చు. 

డ్రై ఫ్రూట్‌ లడ్డు 
కావలసినవి: ఖర్జూరాల ముక్కలు – కప్పు; బాదం – 3 టేబుల్‌ స్పూన్‌లు; కిస్‌మిస్‌ – 2 టేబుల్‌ స్పూన్‌లు; జీడిపప్పు – 2 టేబుల్‌ స్పూన్‌లు; అంజీర్‌ – 8; కొబ్బరి తురుము – టేబుల్‌ స్పూన్‌; యాలకులు – 2. 

తయారీ: బాదం పప్పును బాగా ఎండబెట్టి సన్నగా తరిగి ఒకపాత్రలో వేయాలి. అంజీర్‌లను కూడా తరగాలి, యాలకులను తొక్క వేరు చేసి గింజలను పొడి చేసి బాదం తరుగులో వేయాలి. మిక్సీ జార్‌లో ఖర్జూరం పలుకులు, అంజీర్‌ మిశ్రమం, జీడిపప్పు, కిస్‌మిస్, బాదం తరుగు, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి సమంగా కలిసేటట్లు బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని కావలసిన సైజ్‌లో లడ్డూలుగా తయారు చేయాలి.  

పుచ్చకాయ రసం 
కావలసినవి: పుచ్చకాయ – 1 (మీడియం సైజ్‌); పుదీన ఆకులు – 2 టేబుల్‌ స్పూన్‌లు; నిమ్మరసం – టీ స్పూన్‌.

తయారీ: పుచ్చకాయలో గింజలు తీసేసి ముక్కలు తీసుకోవాలి. ఈ ముక్కల్లో పుదీనా ఆకులు వేసి మిక్సీ జార్‌ (జ్యూస్‌ బ్లెండర్‌)లో గ్రైండ్‌ చేయాలి. చివరగా నిమ్మరసం కల పాలి. ఫైబర్‌ సమృద్ధిగా అందాలంటే ఈ మిశ్రమాన్ని వడపోయకుండా తాగవచ్చు. అలా తాగలేకపోతే వడపోసి తాగవచ్చు.  
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top