యుద్ధం వల్ల గుళికల యూరియా, డీఏపీల కొరత తీవ్రతరం
నానో యూరియా, డీఏపీలతో నిశ్చింతగా పంటలు పండించుకోవచ్చు
45 కిలోల బస్తా ఎరువు బదులు అర లీటరు నానో ఎరువు వాడితే చాలు
దిగుబడి తగ్గదు, ఖర్చూ తక్కువే, ఎరువులు దొరకవన్న దిగుల్లేదంటున్న ‘ఇఫ్కో’
పశ్చిమాసియా యుద్ధం ఇచ్చిన షాక్‌తో దేశంలో రసాయనిక ఎరువులకు తీవ్ర కొరత వచ్చి పడింది. యూరియా, డీఏపీ, ఫాస్ఫరస్ వంటి ఎరువులకు గత 60 ఏళ్లుగా మన రైతులు అలవాటైపోయారు. ప్రస్తుత సంక్షోభ కాలంలో ఈ అలవాటు మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రసాయనిక ఎరువులకు బదులుగా సులువుగా వాడదగిన ఎరువులేవైనా ఉన్నాయా? అంటే.. తప్పకుండా ఉన్నాయి. అవే ‘నానో ఎరువుల’ని ‘ఇఫ్కో’ ఘంటాపథంగా చెబుతున్నది.
నానో ఎరువులపై రైతులు ఇప్పటికీ, ఎప్పటికీ, పూర్తిగా ఆధారపడొచ్చని ‘ఇఫ్కో’ ఘంటాపథంగా చెబుతోంది. నానో ఎరువులను వాడుతున్న రైతుల అనుభవాలు కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయంటున్నారు. సబ్సిడీ లేని సహకార ఎరువులు కావటంతో ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ‘తక్షణ ఎరువుల కొరతను అధిగమించేందుకు నానో ఎరువులే ఉత్తమ మార్గం. దీర్ఘకాలంలో ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లోకి మారి పోవటమే ఉత్తమం..’ అని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఇంతకీ నానో ఎరువులంటే ఏమిటి? ఏయే పంటలు/తోటలకు ఎలా వాడాలి? రైతుల అనుభవాలేమిటి? పరిశీలిద్దాం.
మన దేశంలో రైతులు ఏర్పాటు చేసుకున్న సహకార దిగ్గజ సంస్థల్లో ఒకటి ‘ఇఫ్కో’ (ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇఫ్కో దేశీయంగా తయారు చేస్తున్న నానో యూరియా, నానో డీఏపీ తదితర నానో ద్రవ రూప ఎరువులు ప్రపంచంలోనే అరుదైనవి. వీటిని గత ఐదేళ్లుగా ఇఫ్కో రైతులకు విక్రయిస్తోంది. సాంప్రదాయక గుళికల యూరియా, డీఏపీకి బదులుగా.. ద్రవరూపంలో ఉండే నానో యూరియా, నానో డీఏపీ, నానో పొటాష్ ఎరువులు వాడినప్పుడు ఎటువంటి దిగుబడి నష్టం లేదని, అధిక దిగుబడులే వస్తున్నాయని ఇఫ్కో క్షేత్రప్రయోగాల ద్వారా నిరూపించింది. రైతులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నానో ఎరువులు వల్ల దిగుబడి తగ్గుతుందన్న దిగుల్లేదు, ఖర్చు తక్కువ, నానో ఎరువులు దొరకవన్న భయం లేదు. నేల, నీరు, గాలి కాలుష్యం కూడా ఉండదని ఇఫ్కో చెబుతోంది.
అర లీటరు సీసా ఒక బస్తాకు సమానం
500 మి.లీ. నానో ద్రవ యూరియా సీసా ఒక బస్తా సాంప్రదాయ గుళికల యూరియాతో సమానం. ఎరువుల ఉత్పత్తిలో వాడే సహజ వాయువు విదేశీ దిగుమతులు తగ్గినా, నానో ఎరువుల రూపంలో రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేసే సామర్థ్యం ఉందని ఇఫ్కో స్పష్టం చేసింది. నానో ఎరువుల గురించి రైతులకు నచ్చజెప్పే లక్ష్యంతో 19 రాష్ట్రాల్లో ఇఫ్కో తాజాగా భారీ ప్రచారోద్యమం చేపట్టింది.
నానో ఎరువుల ప్రత్యేకతేంటి?
గుళికల ఎరువులు: చిన్న గుళికల రూపంలో ఉండే యూరియా, డీఏపీ, పొటాష్ వంటి సాధారణ రసాయనిక ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సహజ వాయువుతో తయారు చేస్తారు. వీటిని భూమిలో వేస్తే, వేసిన ఒకటి, రెండు రోజుల్లోనే ఆకులు ముదురు ఆకుపచ్చగా మారతాయి. కానీ, ఎక్కువగా పెరిగి పంట పడిపోతుంది. ఎక్కువగా చీడపీడలు ఆశిస్తాయి. 30–40% పోషకాలను మాత్రమే మొక్కలు వాడుకోగలుగుతాయి.
నానో ఎరువులు: నానో యూరియా ప్లస్, నానో డీఏపీ, నానో పొటాష్ తదితర నానో ఎరువులు ద్రవ రూపంలో ఉంటాయి. ఇఫ్కో దేశీయ పరిజ్ఞానంతో తయారు చేస్తోంది. తక్కువ ఖర్చు. విరివిగా దొరుకుతాయి. వీటిలో పోషకాల కణం చాలా చిన్నగా 20–50 నానో మీటర్ల సైజులో ఉంటాయి. నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తారు. ఆకులు ఈ పోషకాలను 80–90% మేరకు త్వరగా ఉపయోగించుకోగలుగుతాయి. మామూలు స్ప్రేయర్లు, డ్రోన్లతో చల్లితే పంటలు వెంటనే ముదురు ఆకుపచ్చ రంగులోకి మారవు. కానీ, బలంగా పెరుగుతాయి. రొట్ట ఎక్కువగా పెరగదు. గాలులకు పడిపోదు. తాలు ఉండదు. దిగుబడి పెరుగుతుంది. చీడపీడల సమస్య తగ్గుతుంది.
శాస్త్రవేత్తల ఆమోదం
ప్రపంచ ప్రమాణాల ప్రకారం సురక్షితమైనవిగా గుర్తింపు పొందిన నానో ఎరువులు ఇతర జీవరాశికి సురక్షితమైనవి. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), నానో అగ్రి ఇన్పుట్ ప్రొడక్ట్స్–2020 మార్గదర్శకాలకు అనుగుణంగా తయారుచేసినవని ఇఫ్కో తెలిపింది.
నానో ఎరువుల సామర్థ్యంపై శాస్త్రీయ ధ్రువీకరణ కోసం వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయని ఇఫ్కో అధికారులు ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. హైదరాబాద్‌లోని కేంద్రీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–క్రీడ) వంటి అగ్రగామి వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో విస్తృతమైన క్షేత్ర పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ వ్యవసాయ కళాశాలల్లో జరుగుతున్న క్షేత్ర ప్రయోగాల్లో అత్యంత సంతృప్తికరంగా ఫలితాలు వస్తున్నాయని ఇఫ్కో అధికారులు ప్రకటించారు. ప్రభుత్వభాగస్వామ్యం, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు, తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ, ఐసీఏఆర్ పరిశో ధన సంస్థలు నానో ఎరువులపై విస్తృత ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది నానో సాంకేతికతపై రైతుల్లో విశ్వాసాన్ని పెంచిందని చెబుతున్నారు.
విస్తృతంగా ప్రదర్శనా క్షేత్రాలు
నానో ఎరువులపై రైతుల సందేహాలను నివృత్తి చేయటానికి, పంట దిగుబడిపై నానో ఎరువుల సానుకూల ప్రభావాన్ని కళ్ళారా చూపించడానికి ఇఫ్కో విస్తృతంగా ప్రదర్శనా క్షేత్రాలను నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తోంది. నానో ఎరువుల వ్యాప్తికి ఈ క్షేత్రాలు బలమైన పునాది వేశాయి. గ్రామీణ యువతకు, మహిళలకు డ్రోన్లను అందించి, ఎకరానికి రూ. 300 ఖర్చుతో డ్రోన్లతో నానో ఎరువుల పిచికారీ జరుగుతోంది. పిచికారీ సమయం, శ్రమ తగ్గటంతో ఈ సాంకేతికతను రైతులు వేగంగా స్వీకరిస్తున్నారని ఇఫ్కో చెబుతోంది.

నానో ఎరువుల వాడకం వేగంగా పెరుగుతోంది
సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా ఇఫ్కో ప్రవేశపెట్టిన నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వాడకం వేగంగా పెరుగుతోంది. రైతులు అనూహ్య వేగంతో అందిపుచ్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2025–26లో వానాకాలం, యాసంగి కలిపి 10.46 లక్షల సీసాల నానో ఎరువులను రైతులు వాడటమే ఇందుకు నిదర్శనం. విత్తనం వేసే ముందు లేదా మొక్కలు నాటే దశలో సంప్రదాయ గుళికల యూరియా, డీఏపీలను వాడుకోవాలి. పంట మొక్కలకు ఆకులు పెరిగినాక రెండో విడత, మూడో విడత వేసే గుళికల ఎరువులకు బదులుగా నానో యూరియా, నానో డీఏపీలను నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
గుళికల రూపంలో ఉండే సంప్రదాయ యూరియా, డీఏపీ, పొటాష్ వంటి రసాయనిక ఎరువుల మోతాదును 25 నుంచి 50% వరకు తగ్గించి, పంట కొన్ని రోజులు ఎదిగిన తర్వాత నానో యూరియా, నానో డీఏపీ వంటి ద్రవ రూప ఎరువులను రెండు సార్లు పిచికారీ చేస్తున్న చాలా మంది రైతులు ఖర్చు తగ్గించుకుంటూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అయితే, సంప్రదాయ గుళికల యూరియా, డీఏపీ ఎరువులను పూర్తిగా మానేసి.. కేవలం నానో ఎరువులు, జీవన ఎరువులు, సముద్రపు నాచు ద్రావణాలను కలిపి వాడి పంటలు పండిస్తూ మంచి దిగుబడులు పొందుతున్న రైతులు కూడా కొందరు ఉన్నారు. నానో ఎరువులు వాడితే ఎకరాకు సుమారు రూ. 2 వేల వరకు ఖర్చు తగ్గుతుందని, 8% వరకు దిగుబడి పెరుగుతుందని మా క్షేత్ర ప్రయోగాల్లో తేలింది. 
– ఎం.ఆర్. కృపాశంకర్, ఇఫ్కో,
తెలంగాణ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్
ఊళ్లో నాదే అత్యధిక దిగుబడి!
వరి పంటకు అడుగున కొద్దిగా డీఏపీ మాత్రమే వాడాను. మిగతా పోషకాలకు బస్తాలు వేయకుండా.. నానో యూరియా, నానో డీఏపీ, సాగరిక కలిపి డ్రోన్ ద్వారా పిచికారీ చేయించాను. మా చుట్టుపక్కల పొలాలన్నింటిలో ఎండాకు తెగులు వచ్చినా, నా పొలానికి అస్సలు రాలేదు. పంట బలంగా నిలబడింది, గింజ కూడా బరువుగా, నాణ్యంగా ఉంది. ఈ కొత్త నానో ఎరువులతో ఎకరానికి 33 క్వింటాళ్లు వరి ధాన్యం దిగుబడి వచ్చింది. మా ఊళ్లో నాదే అత్యధిక దిగుబడి!.
– ఎం. కృష్ణార్జున రావు (90320 37954),
మల్లుపల్లి, ఖమ్మం జిల్లా
పత్తి దిగుబడి పెరిగింది!
నేను పంటలతో పాటు పశువులను పెంచుకుంటూ సమగ్ర వ్యవసాయం చేస్తున్నా. పత్తి సాగులో ఖర్చులు తగ్గించుకోవాలని నానో ఎరువులు వాడటం మొదలుపెట్టా. సాధారణ ఎరువులు సగం తగ్గించి, వాటి బదులు నానో యూరియా, నానో డీఏపీ పిచికారీ చేశా. ఆశ్చర్యం ఏంటంటే, ఎరువుల ఖర్చు తగ్గి, దిగుబడి పెరిగింది! పక్క పొలంలో ఎకరానికి పత్తి 8.5 క్వింటాళ్లు వస్తే, నా పొలంలో 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నానో ఎరువులతో రైతుకు లాభమే.
– మల్లారావు (99597 13273),
రవిపహాడ్, సూర్యాపేట జిల్లా
పూర్తిగా నానో ఎరువులే వాడుతున్నా..
గత మూడేళ్లుగా నేను ఒక్క బస్తా గుళికల యూరియా, డీఏపీ కూడా వాడలేదు. పూర్తిగా నానో ఎరువులపైనే ఆధారపడుతున్నా. నానో డీఏపీతో విత్తనశుద్ధి చేస్తా, ఆ తర్వాత మూడు సార్లు నానో యూరియా పిచికారీ చేస్తా. దీనికి అదనంగా జీవ ఎరువులను కూడా వాడుతున్నా. ఈ విధానంతో పత్తి, వరి, మొక్కజొన్నలో నాణ్యమైన దిగుబడి సాధిస్తున్నా. నా పొలంలో వచ్చిన ఫలితాలు చూసి, మా ఊరి రైతులు చాలా మంది నానో ఎరువులు వాడటం మొదలుపెట్టారు.
– బోయపాటి నరసింహారావు (88970 07608),
అనంతారం, వరంగల్ జిల్లా
నానో ఎరువులతో కొత్త మార్పు
సోయా, పత్తి పంటల్లో రెండు సంవత్సరాలుగా నానో ఎరువులు వాడుతున్నా. ముందు బస్తాల ఎరువులు ఎక్కువ వేస్తేనే పంట బాగుంటుందని అనుకునేవాళ్లం. కానీ నానో ఎరువులు వేసాక మొక్కలు ఇంకా ఆరోగ్యంగా, సమానంగా పెరుగుతున్నాయి. పత్తిలో కాయ పరిమాణం పెరగడం, సోయాలో పూత సమానంగా వస్తోంది. స్ప్రే చేసిన తర్వాత మొక్కల పెరుగుదల బాగుంది. పెట్టుబడి తగ్గినా పంట నాణ్యత మాత్రం బాగుంది. నానో ఎరువులతో కొత్త మార్పు వచ్చింది.
– ఉగ్గె రాము (90005 91246),
చందా(టీ), ఆదిలాబాద్ రూరల్ మండలం, ఆదిలాబాద్ జిల్లా


