వాస్తవిక నటి.. షబానా ఆజ్మీ @ 72

 Hyderabad Actress Shabana from is entering her 72nd year - Sakshi

పది డైలాగులు అవసరమైన చోట ఒక ముఖ కవళిక. పెద్దగా అరవాల్సిన చోట ఒక లోగొంతుక. భోరున విలపించాల్సిన చోట కంటి నుంచి జారని నీటి చుక్క. పగలబడి నవ్వాల్సిన చోట పంటి మెరుపు... ఇవి నటన అని చూపించిన నటి షబానా ఆజ్మీ. ఆమె వల్ల స్త్రీ పాత్రలు తెరపై వాస్తవికంగా కనిపించాయి. ఆమె వల్ల కథలు నిజంగా నమ్మించాయి. ఆమె కొంతమంది నటీనటులకు నటగ్రంథం అయ్యింది. ఆమెను భారతీయ వెండితెర సదా గౌరవంగా చూస్తుంది. మన హైదరాబాద్‌ నటి షబానా 72వ ఏట అడుగుపెడుతోంది.

చూడండి ఎలా హైదరాబాద్‌తో ఆమె జీవితం ముడిపడిందో. 1950 సెప్టెంబర్‌ 18న ఇక్కడే పుట్టిందామె. తల్లి షౌకత్‌ ఆజ్మీది హైదరాబాద్‌ కనుక కాన్పుకు పుట్టింటికి రావడంతో ఇక్కడే నాలుగు నెలలు ఊపిరి పీల్చింది. ఆ తర్వాత ముంబై చేరుకుంది. పూణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌ కోర్స్‌ నేర్చుకునే సమయంలో ఆమెకు రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి కె.ఏ.అబ్బాస్‌ ‘ఫాస్‌లా’, రెండు కాంతిలాల్‌ రాథోడ్‌ ‘పరిణయ్‌’.

కాని రెంటి కంటే ముందు తొలిసినిమాగా ‘అంకుర్‌’ విడుదలైంది. శ్యామ్‌ బెనగళ్‌ దర్శకత్వంలో హైదరాబాద్‌ నేపథ్యంగా సాగే ఆ కథే ఆమె తొలి కథ అయ్యింది. అందులోని గ్రామీణురాలు లక్ష్మి ఆమె తొలి పాత్ర అయ్యింది. దక్కనీ ఉర్దూ ఆమె తొలి సంభాషణ అయ్యింది. తొలి జాతీయ అవార్డు కూడా ఆ సినిమాతోనే వచ్చింది. హైదరాబాద్‌ గాలి హైదరాబాద్‌ అమ్మాయికి గొప్ప ప్రారంభం ఇచ్చింది.

తండ్రి కైఫీ ఆజ్మీ కమ్యూనిస్టు కవి. షౌకత్‌ ఆజ్మీ ‘ఇప్టా’ సభ్యురాలు. 9 ఏళ్ల వయసు వచ్చే వరకూ షబానా ఆజ్మీ ముంబైలో రెడ్‌ఫ్లాగ్‌ హౌస్‌లో ఉండేది. అంటే 8 కమ్యూనిస్టు కుటుంబాలు ఉండే చిన్న భవనం అన్నమాట. దానికి ఒకటే టాయ్‌లెట్‌. ఒకటే బాత్‌రూమ్‌. కాని వాళ్లంతా కలిసి మెలిసి జీవించేవారు. కైఫీ ఆమెకు ఆ వయసులో ఒక నల్లటి బొమ్మ తెచ్చి ఇచ్చాడు. షబానా ఆ బొమ్మను చూసి ‘నా ఫ్రెండ్స్‌ అందరి దగ్గర తెల్లటి బొమ్మలున్నాయి’ అనంటే ఆయన ‘నలుపు కూడా అందమైనదే.

నీకు ఆ సంగతి తెలియాలి’ అని చెప్పాడు. అలాంటి వాతావరణంలో ఆమె పెరిగింది. ఇంటికి ఎప్పుడూ వచ్చేపోయే కవులు... పార్టీ సభ్యులు. షబానాకు పేరు పెట్టక ఇంట్లో ‘మున్నీ’ అని పిలుస్తుంటే ఇంటికి వచ్చిన కవి అలీ సర్దార్‌ జాఫ్రీ ‘ఇంకా పేరు పెట్టకుండా ఏమిటయ్యా’ అని తనే షబానా అని పేరు పెట్టాడు. ఆమె తోటి స్నేహితురాళ్లు ఫ్యాంటసీ బొమ్మల పుస్తకాలు చదువుతుంటే షబానాకు రష్యా నుంచి వచ్చే పుస్తకాలు చదవడానికి దొరికేవి.

తండ్రి వల్ల సాహిత్యం తల్లి పృధ్వీ థియేటర్‌లో పని చేయడం వల్ల నటన ఆమెకు తెలిశాయి. పృథ్వీ థియేటర్‌లో నాటకం వేస్తే గ్రూప్‌లో ఒకరిగా స్టేజ్‌ ఎక్కేసేది. స్కూల్లో కూడా స్టేజ్‌ వదిలేది కాదు. కాలేజీలో చేరితే అక్కడ కేవలం ఇంగ్లిష్‌ థియేటరే నడుస్తూ ఉంటే తన సీనియర్‌ అయిన నటుడు ఫరూక్‌ షేక్‌తో కలిసి హిందీ డ్రామా ప్రారంభించింది. అన్ని పోటీల్లో ప్రైజులు కొట్టేది. షబానాకు తాను నటించగలనని తెలుసు. కాని నటనను వృత్తిగా తీసుకోవాలనుకున్న సందర్భం వేరు.

షబానా ఆజ్మీ ఒకసారి జయ భాదురి నటించిన ‘సుమన్‌’ అనే సినిమా చూసింది. అందులో జయ భాదురి నటన కొత్తగా అనిపించింది. ‘ఈమెలాగా నేనూ నటిని కావాలి’ అనుకుని తండ్రితో చెప్పి, పూణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరతానంటే ‘నువ్వు ఏ రంగమైనా ఎంచుకో. కాని అందులో బెస్ట్‌గా నిలువు’ అని ఆయన అన్నాడు. పూణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో షబానా నటిగా తొలిరోజుల్లోనే అందరి దృష్టిలో పడింది. పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. ‘అంకుర్‌’ కూడా అలాగే వచ్చింది.

నగరమే తప్ప పల్లెటూరు చూసి ఎరగని షబానా ‘అంకుర్‌’ కోసం చాలా హోమ్‌ వర్క్‌ చేయాల్సి వచ్చింది. మడమల మీదుగా చీర కట్టుకొని హైదరాబాద్‌ చుట్టూ ఉన్న పల్లెటూళ్లలో అలా ఉండే స్త్రీలను గమనించింది. అంతవరకూ ఆమెకు మునికాళ్ల మీద కూచోవడం రాదు. ‘లక్ష్మి’ పాత్ర వంట చేయాలన్నా పనులు చేయాలన్నా మునికాళ్ల మీద కూచోవాలి. అందుకని శ్యాం బెనగళ్‌ ఆమెను ‘నువ్వు మునిగాళ్ల మీద కూచుని భోం చేయ్‌’ అని డైనింగ్‌ టేబుల్‌ మీద కూచోనిచ్చేవాడు కాదు. ‘అంకుర్‌’ సినిమాలో షబానా తన నడక, మాట తీరు, ముఖ కవళికలు వీటన్నింటితో లక్ష్మి పాత్రను గొప్పగా తెర మీద ప్రతిష్టించింది. ఆ సినిమా వేసిన అంకురం అతి త్వరగానే మహా వృక్షమైంది.

ఒక కాలం అది. నసీరుద్దీన్‌ షా, ఫరూక్‌ షేక్, ఓంపురి, స్మితాపాటిల్, షబానా ఆజ్మీ... వీళ్లు భారతీయ పారలల్‌ సినిమాకు ఊతంగా నిలబడ్డారు. వీరే పునాది, వీరే గోడలు, వీరే పైకప్పు. స్మితా పాటిల్, షబానా ఆజ్మీల మధ్య పోటీ ఉండేది. కాని ఎవరికి వారు తమ పాత్రలలో చెలరేగి ఎవరు గొప్పో చెప్పడం కష్టం చేసి పెట్టేవారు. శేఖర్‌ కపూర్‌ ‘మాసూమ్‌’ లో భర్త అక్రమ సంతానాన్ని అంగీకరించేందుకు మథన పడే భార్యగా షబానా గొప్ప నటన ప్రదర్శించింది. మహేశ్‌ భట్‌ ‘అర్థ్‌’లో మరొక స్త్రీ ఆకర్షణలో పడిన భర్త గురించి ఆమె పడిన సంఘర్షణ ప్రేక్షకులను కదిలించింది.

శ్యామ్‌ బెనగళ్‌ ‘మండీ’, మృణాల్‌సేన్‌ ‘ఖండర్‌’, గౌతమ్‌ఘోష్‌ ‘పార్‌’... దర్శకులు ఆమె వల్ల ఆమె దర్శకుల వల్ల భారతీయ సినిమాను ఉత్కృష్ట ప్రమాణాలకు చేర్చారు. దీపా మెహతా ‘ఫైర్‌’, శాయి పరాంజపె ‘స్పర్శ్‌’, సత్యజిత్‌ రే ‘షత్రంజ్‌ కే ఖిలాడీ’, తపన్‌ సిన్హా ‘ఏక్‌ డాక్టర్‌ కీ మౌత్‌’... ఇవన్నీ ఆమెను తలిస్తే తలువబడే సినిమాలు. తెలుగు దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మించిన ‘మార్నింగ్‌ రాగా’లో క్లాసికల్‌ సింగర్‌గా నటించిందామె. మూస తల్లి పాత్రలు, మూస వదిన, అత్త పాత్రలు ఆమె ఏనాడూ చేయలేదు. ఆమెకు పాత్ర రాసి పెట్టి ఉండాలి. పాత్రకు ఆమె రాసి పెట్టి ఉండాలి. ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’, ‘ఫకీరా’ వంటి కమర్షియల్‌ సినిమాలు చేసినా ఆమె అందుకు పుట్టలేదు. ఆ తర్వాత ఆ దారి పట్టలేదు.

షబానా ఆజ్మీ గీతకర్త జావేద్‌ అఖ్తర్‌ను వివాహం చేసుకుంది. రాజ్యసభ సభ్యురాలిగా పని చేసింది. సామాజిక కార్యకలాపాలలో పాల్గొంది. తండ్రి పేరు మీద ఆయన స్వగ్రామంలో స్త్రీల కోసం ఉపాధి కల్పనా కేంద్రాలను తెరిచింది. ఆమెకు ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది.
షబానా వెండితెరకు హైదరాబాద్‌ అందించిన గోల్కొండ వజ్రం. దాని మెరుపులు మరిన్ని కొనసాగాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top