మే 1న వైశాఖ శుద్ధ పూర్ణిమ... బుద్ధపూర్ణిమ
ఆమ్రపాలి క్రీ.పూ. 500 సంవత్సర ప్రాంతానికి చెందినది. గౌతమ బుద్ధుని సమకాలికురాలు. ఆమ్రపాలి అంటే ‘మామిడి చిగురు’ అని అర్థం. ఆమ్రపాలికి అంబపాలిక, అంబపాలి, ఆమ్ర అనే నామాంతరాలూ ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులెవరో తెలియదు. వైశాలి నగరంలో మామిడి తోటలో ఒక చెట్టు కింద పసిపిల్లగా ఏడుస్తూ పడి ఉంటే సోమదత్తుడు అనే ఆయన ఇంటికి తెచ్చుకొని ఆ పాపను పెంచి పెద్ద చేశాడు. కౌమార దశలోనే ఆమ్రపాలి అపురూప సౌందర్యవతిగా, అద్భుత నాట్య కళాకారిణిగా ఖ్యాతి గడించింది.
లిచ్ఛవి జాతికి చెందిన రాజులకు వైశాలి నగరం రాజధానిగా ఉండేది. ఆ కాలంలో అందమైన స్త్రీలు పెండ్లిచేసుకొని కేవలం ఒక వ్యక్తితో జీవించడం కాక, తమకు నచ్చిన పురుషునితో రోజుకు ఒకరితో గడిపే ఆచారం వైశాలిలో ఉండేది. ఆమ్రపాలి తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు అయిన పుష్ప కుమారుని వివాహం చేసుకోవాలనుకొంది. కానీ వైశాలి రాజు మనుదేవుని కన్ను ఆమ్రపాలిపై పడింది. ఆమె పెండ్లి రోజునే పుష్పకుమారుని హత్యచేసి మనుదేవుడు ఆమ్రపాలిని వైశాలి ‘నగర వధు’ (వేశ్య)గా అధికారికంగా ప్రకటించాడు.
ఆమ్రపాలి రాజనర్తకిగా నియమింప బడింది. ఆమె జగన్మోహన సౌందర్యం, అసమాన నాట్య కౌశలం ఎంతోమంది రాజులను, ధనవంతులను ఆకర్షించింది. ఆమె నాట్యం చూడటానికి, ఆమెతో గడపటానికి యాభై ‘కార్షపణములు’ వెలగా నిర్ణయింపబడింది. స్వల్పకాలంలోనే ఆమ్రపాలి సంపద ఏ రాజు కోశాగారంలో లేనంతగా పెరిగి పోయింది. అలా రాజనర్తకి, సౌందర్యరాశి అయిన ఆమ్రపాలి రాజాధిరాజుల, ధనవంతుల ప్రాపకంలో అత్యంత ధనవంతురాలై, సుఖంగా జీవించ సాగింది. గౌతమ బుద్ధుడు వైశాలి నగరానికి వచ్చాడు. ఆయన గొప్పదనం గూర్చి చెలికత్తెల ద్వారా విని, ఆయన తన వద్దకు ఎందుకు రాలేదా అని ఆశ్చర్య పడింది ఆమ్రపాలి.
ఒకరోజు బుద్ధుడు వచ్చి, ఆమె భవనం ముందు నిలబడి భిక్ష కోరాడు. సమస్త ఆభరణాలూ ధరించి, ద్విగుణీకృత అలంకారాలతో ఆమ్రపాలి బయటకు వచ్చి, తన సౌందర్యవంతమైన రూపలావణ్యాలను ప్రదర్శిస్తూ బుద్ధుని ముందు నిలబడి, ‘‘నా ఈ దేహాన్ని మీకు భిక్షగా ఇస్తాను. స్వీకరిస్తారా’’ అని వగలొలికిస్తూ అడిగింది. ఆమె మాటలు విని కొంతసేపు కండ్లు మూసుకొని, తర్వాత కండ్లను తెరిచి, బుద్ధుడు ఆమ్రపాలితో ‘అలాంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నీ భిక్షను తప్పక స్వీకరిస్తాను. అందాకా సెలవు‘ అని చెప్పి వెళ్ళిపోయాడు.
కొంతకాలానికి ఆమ్రపాలి శరీర పటుత్వం తగ్గింది. వేశ్యావృత్తి వలన ఆమె శరీరాన్ని అనేక రోగాలు చుట్టుముట్టాయి. క్రమంగా ఆమె కుష్ఠురోగి అయ్యింది. కురూపి అయ్యింది. విటులతోబాటు దాసదాసీ జనమంతా దూరమయ్యారు. సంపద నశించి పోయింది. ఆమె వికార రూపం అందరితో అసహ్యించుకోబడింది. సమాజంచే బహిష్కరింపబడిన ఆమ్రపాలి ఊరి బయట ఒక చిన్న కుటీరంలో దుఃఖభూయిష్ట జీవితం గడపసాగింది. ఒకరోజు వర్షం పడుతూండగా సాయంత్రంవేళ, చిరుచీకట్లు అలుముకొంటున్న సమయంలో, తన కుటీర ఆవరణలో కూర్చొని ఉన్న ఆమ్రపాలికి ’అమ్మా’ అన్న పిలుపు వినబడింది. ఒక ఆజానుబాహువు తన దగ్గరకు వస్తూండడం చూసి, బుద్ధుడు అని గ్రహించి, ‘అక్కడే ఆగు. సమీపానికి రావద్దు. నేనొక కుష్ఠు రోగిని’ అనింది ఆమ్రపాలి.
‘అమ్మా, మరిచావా నన్ను. ఒకరోజు భిక్షకోరి మీ ఇంటికి వస్తే మీ శరీరాన్నే భిక్షగా ఇస్తానన్నారు. అలాంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు తప్పక స్వీకరిస్తానని అన్నాను. ఇప్పుడు ఆ భిక్షను ఇవ్వమ్మా’ అని ఆర్ద్రంగా పలికాడు బుద్ధుడు. ‘ఆ రోజు నేను నీకు ఇస్తానన్నది అందం, ఆరోగ్యం, యవ్వనంతో కూడిన శరీరాన్ని. ఈ రోజు ఆ దేహం వ్యాధిగ్రస్తమయ్యింది’ అంటూ దూరం జరిగింది ఆమ్రపాలి.
చదవండి: సంకల్పం ముందు వైకల్యం ఎంత!
దయామయుడైన బుద్ధుడు ‘అమ్మా, అందచందాలతో మాకు అవసరంలేదు. భయంకరమైన రోగంతో దేహం శిథిలమైనా పరివర్తన చెందిన మనసు మీది’ అంటూ మరింత దగ్గరగా రాసాగాడు. ఆయన నుంచి తప్పించుకొని దూరంగా వెళ్ళే ప్రయత్నంలో కిందపడిపోయిన ఆమ్రపాలిని తన రెండు చేతులతో ఎత్తుకొని ‘నా కన్నతల్లి నా చిన్నప్పుడే చనిపోయింది. ఆమెకు సేవ చేసే భాగ్యం నాకు లేక పోయింది. నీలో నా కన్నతల్లిని చూసుకుంటూ సేవచేసే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ’ అంటూ ఆమెను మెల్లగా కుటీరంలోకి చేర్చి, ఆమె తుది శ్వాస విడిచే వరకూ సేవలు చేశాడు కరుణామూర్తి బుద్ధ భగవానుడు.
బుద్ధం శరణం గచ్ఛామి
– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి


