సూటు..బూటు..బీఎండబ్య్లూ కారు

Fake IPS In AP And Telangana Allegedly Involved Scams  - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: ఐఏఎస్‌ అధికారిగా ప్రచారం చేసుకుంటూ ప్రముఖులతో పరిచయాలను అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని  గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఇతను గతంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 9లోని ఓ మహిళకు చెందిన రూ. 25 కోట్ల విలువ చేసే ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించాడు. ప్రధాని మోదీ భద్రతా సలహాదారునంటూ పోలీసులను బురిడీ కొట్టించేందుకు యత్నించాడు.

వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లాకు చెందిన తెలదేవులపల్లి వెంకట లక్ష్మినరసింహమూర్తి కొంత కాలంగా ఐఏఎస్‌నని చెప్పుకుంటూ అటు పోలీసు ఉన్నతాధికారులను, ఇటు ప్రధాని, ముఖ్యమంత్రి కార్యాలయాల ప్రముఖులను నమ్మిస్తూ పలువురికి రూ.కోట్లలో టోకరా వేశాడు. ఖరీదైన దుస్తులతో, బీఎండబ్య్లూ కారుకు పీఎంఓ కార్యాలయం అంటూ స్టిక్కర్‌ తగిలించి ఘరానా మోసాలకు పాల్పడుతున్నట్లుగా తేలింది.

జూబ్లీహిల్స్‌లోని ఒంటరి మహిళ ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించిన అతను ఆమెను ఇంటి నుంచి బయటికి పంపించేందుకు గతేడాది డిసెంబర్‌ 30న జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశాడు. అతడి వైఖరిపై అనుమానం వచ్చిన పోలీసులు సివిల్‌ మ్యాటర్‌ కింద కేసును పక్కన పెట్టారు. అయితే తాను ప్రధాని మోదీ భద్రతా సలహాదారుగా పని చేస్తున్నానని జూబ్లీహిల్స్‌ పోలీసులు తన మాట వినడం లేదని తనకు ఎక్స్‌ప్రెస్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వాల్సిందిగా కోరుతూ గవర్నర్‌కు నకిలీ లెటర్‌ ప్యాడ్‌పై లేఖ రాశారు.

అయితే గవర్నర్‌ కార్యాలయం అతడికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ చేశానని, ఇస్రో పాలసీ మేకర్‌నని పీఎంవో భద్రతా సలహాదారునని తనకు 20 డిగ్రీలు ఉన్నాయని సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకుంటూ పలువురిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గతంలో పోలీసు ఉన్నతాధికారులకు న్యాయ సలహాదారుగా పని చేసిన ఓ వ్యక్తి ఇతడికి అండగా నిలవడంతో మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

జూబ్లీహిల్స్‌లోని ఇంటిని ఖాళీ చేసే విషయంలో నానా రభస చేశారు. అందులో దేశ భద్రతకు సంబంధించిన రికార్డులు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయంటూ పోలీసులకు చుక్కలు చూపించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌(డీవోపీటీ)లో ఆరా తీయగా ఆ పేరు మీద ఐఏఎస్‌లు ఎవరూ లేరని స్పష్టమైంది. విషయం తెలుసుకున్న ఐబీ అధికారులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నకిలీ ఐఏఎస్‌పై విచారణ చేస్తుండగానే గుంటూరులో పట్టుబడ్డాడు.  

దొరికింది ఇలా.. 
సదరు నకిలీ ఐఏఎస్‌ టీవీ. లక్ష్మీనరసింహ మూర్తి పీఏనంటూ శుక్రవారం రాత్రి నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి  మా సార్‌ నరసింహ మూర్తి మాట్లాడుతారని ఎస్‌ఐ ఆరోగ్య రాజ్‌కు ఫోన్‌ ఇచ్చారు. తాను డీజీపీ, ఎస్పీతో మాట్లాడానని చెప్పిన నరసింహ మూర్తి తాను బస చేసిన హోటల్‌కు కానిస్టేబుళ్లను పంపించాలని సూచించాడు. ఈ విషయాన్ని ఎస్‌ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.

దీంతో డీఎస్సీ ప్రశాంతి నరసింహ మూర్తికి  ఫోన్‌ చేయగా తాను అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌తో మాట్లాడానని, గుంటూరు వికాస్‌ నగర్‌లో ఓ యువతికి తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తనతో పోలీసు బలగాలను పంపించాలని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన డీఎస్పీ సదరు హోటల్‌కు పోలీసులకు పంపగా అప్పటికే నకిలీ ఐఏఎస్‌ అక్కడినుంచి ఉడాయించాడు.

దీంతో పోలీసులు అతడి మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా విజయవాడకు వెళ్తున్న అతడిని అదుపులోకి తీసుకొని అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్‌ఫోన్లు, నకిలీ లెటర్‌హెడ్లు స్వాధీనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయలు కాజేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతడి కోసం ఐబీ గత ఆరు నెలలుగా గాలిస్తోంది. ఇతడి బాధితుల్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, విశ్రాంత అధికారులు ఉన్నట్లు తేలింది.  

(చదవండి: ఫోన్‌ చేసి మాటల్లో పెట్టి.. 5 నిమిషాల్లోనే..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top