ఒపెక్ నుంచి యూఏఈ ఔట్‌.. భారత్‌కు మేలే! | UAE Exit from OPEC Shakes Global Oil Markets India Eyes Energy Independence | Sakshi
Sakshi News home page

ఒపెక్ నుంచి యూఏఈ ఔట్‌.. భారత్‌కు మేలే!

Apr 29 2026 5:22 PM | Updated on Apr 29 2026 5:50 PM

UAE Exit from OPEC Shakes Global Oil Markets India Eyes Energy Independence

అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. ముడిచమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి ‘ఒపెక్’ నుంచి వైదొలుగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనల మధ్య భారతదేశం తన ఇంధన వనరులపై దృష్టి సారించాలని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ‘ది ఎకనామిస్ట్ ఇంపాక్ట్ రెసిలెంట్ ఫ్యూచర్స్ సమ్మిట్’లో ఆయన ప్రసంగిస్తూ గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్‌కు ఇది సానుకూల పరిణామంగా మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒపెక్ పట్టు సడలుతోందా?

1960లో ఏర్పాటైన ఒపెక్ అంతర్జాతీయంగా చమురు ధరలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం 12 దేశాల సభ్యత్వం ఉన్న ఈ కూటమిలో యూఏఈ 1967 నుంచి (మొదట అబుదాబిగా, తర్వాత 1971 నుంచి యూఏఈగా) కీలక భాగస్వామిగా ఉంది. మే 1 నుంచి యూఏఈ ఈ కూటమి నుంచి వైదొలుగుతుందన్న నిర్ణయం చమురు సరఫరా, ధరలపై ఒపెక్‌కు ఉన్న పట్టును బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

‘యూఏఈ నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్లను అతలాకుతలం చేస్తుందా లేదా స్థిరీకరిస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే, భారత్-యూఏఈల మధ్య ఉన్న అసాధారణ భౌగోళిక రాజకీయ సంబంధాలు, నాయకత్వాల మధ్య ఉన్న పరస్పర నమ్మకం దృష్ట్యా ఇది భారత్‌కు మేలు చేస్తుందని భావిస్తున్నాను’ అని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ అన్నారు.

యూఏఈ తన వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఒపెక్ నుంచి బయటకు వచ్చినప్పటికీ మార్కెట్‌ను ఒక్కసారిగా ప్రభావితం చేసే అవకాశం లేదు. క్రమంగా చమురు ఉత్పత్తిని పెంచడం ద్వారా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని యూఏఈ భావిస్తోంది. ఈ అనిశ్చితి కాలంలో దేశీయంగా ఇంధన వనరులను బలోపేతం చేసుకోవడమే భారత్‌కు అత్యంత కీలకమైన రక్షణ కవచం.

ఇదీ చదవండి: ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్..

Advertisement
 
Advertisement
Advertisement