ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్.. | Last Minute Salary Demands Shake Corporate Hiring CEO Calls It Nonsense | Sakshi
Sakshi News home page

ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్..

Apr 29 2026 4:15 PM | Updated on Apr 29 2026 5:23 PM

Last Minute Salary Demands Shake Corporate Hiring CEO Calls It Nonsense

కార్పొరేట్ ప్రపంచంలో నియామక ప్రక్రియలు ఒక్కోసారి వింత పోకడలకు వేదికవుతున్నాయి. ఒక అభ్యర్థికి ఆఫర్ లెటర్ ఇచ్చి, అతను దానికి అంగీకారం తెలిపి, ఇక విధుల్లో చేరతాడు అనే సమయానికి.. చివరి నిమిషంలో భారీ ప్యాకేజీ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 'నాట్ డేటింగ్' (Knot Dating) స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జస్వీర్ సింగ్ తన కంపెనీలో ఎదురైన ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఇది పూర్తిగా ‘నాన్‌ సెన్స్‌’ అన్నారు.

అసలేం జరిగింది?

జస్వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బ్యాకెండ్ డెవలపర్ నియామకం కోసం తమ సంస్థ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఓ అభ్యర్థి ప్రస్తుతం రూ.21 ఎల్‌పీఏ సంపాదిస్తున్నారు. తనకు కంపెనీ సుమారు 33 శాతం పెంపుతో ఏటా రూ.28 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసింది. అభ్యర్థి ఈ ఆఫర్‌ను సంతోషంగా అంగీకరించి కంపెనీలో చేరతానని ధ్రువీకరించారు. కానీ, ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. విధుల్లో చేరడానికి కేవలం రెండు రోజుల ముందు ఆ అభ్యర్థి కంపెనీకి ఒక ఈమెయిల్ పంపారు. తనకు మరో సంస్థ నుంచి రూ.32 లక్షలు ఆఫర్ వచ్చిందని, కాబట్టి తన జీతాన్ని రూ.36 లక్షలకి పెంచితేనే చేరుతానని డిమాండ్ చేశారు.

‘మనం చివరిసారి మాట్లాడుకున్నప్పుడు రూ.28 లక్షలకి అంగీకరించాను. కానీ ఇప్పుడు రూ.32 లక్షలు ఆఫర్ వచ్చింది. నాకు మీ కంపెనీ అంటే ఇష్టమే అందుకే నా ప్యాకేజీని రూ.36 లక్షలకు సవరించే వెసులుబాటు ఉందేమో చూడండి. అలాగే, నేను వారాంతాల్లో పని చేయను’ అని ఆ అభ్యర్థి నిస్సంకోచంగా మెయిల్‌లో పేర్కొన్నారు.

‘ఇది ప్రొఫెషనలిజం కాదు’

ఈ మెయిల్ చూసి విస్మయానికి గురైన జస్వీర్ సింగ్ అభ్యర్థి ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్యాకేజీ గురించి చర్చలు జరపడం సహజమే కానీ, ఒక ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు. ‘ప్రస్తుత కంపెనీలో నోటీసు పీరియడ్ ముగిసే వరకు వేచి చూసి కొత్త కంపెనీలో చేరడానికి రెండు రోజుల ముందు ఇలా డిమాండ్ చేయడం వల్ల కంపెనీ సమయం, వనరులు వృథా అవుతాయి. ఇంకా ఆఫర్ల కోసం వెతుకుతుంటే ఆ విషయాన్ని ముందే చెప్పాలి. ఇది నాన్‌సెన్స్‌’ అని జస్వీర్‌ అన్నారు.

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘ఎక్కడ ఎక్కువ జీతం వస్తే అక్కడికి వెళ్లడం సహజం. కంపెనీలు కూడా అవసరం తీరాక ఉద్యోగులను తొలగిస్తాయి కదా, అప్పుడు లేని నైతికత ఇప్పుడెందుకు?’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘ఒక మాట ఇచ్చాక తప్పడం సరికాదు. మరిన్ని ఆఫర్లు కావాలనుకుంటే అసలు ఆఫర్ లెటర్ మీద సంతకం చేయకూడదు. ఇది రిక్రూటర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది’ అని మరికొందరు వాదిస్తున్నారు.

ఇదీ చదవండి: ‘ఎండీ పదవీకాలం పొడిగించవద్దు’

Advertisement
 
Advertisement
Advertisement