మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ‘బైఅవుట్‌’! | Microsoft Historic Buyout AI Future Reshapes Workforce | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ‘బైఅవుట్‌’!

Apr 24 2026 1:36 PM | Updated on Apr 24 2026 1:43 PM

Microsoft Historic Buyout AI Future Reshapes Workforce

ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన 51 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ప్రకంపనలతో టెక్ పరిశ్రమ రూపురేఖలు మారుతున్న తరుణంలో అమెరికాలోని తన సిబ్బంది కోసం మైక్రోసాఫ్ట్ ‘వాలంటరీ బైఅవుట్’ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకుంటూనే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించడమే లక్ష్యంగా ఈ అడుగు వేసింది.

ఏమిటీ బైఅవుట్?

సాధారణంగా కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా కొన్ని విభాగాలను మూసివేస్తున్నప్పుడు లేఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) ప్రకటిస్తాయి. కానీ, బైఅవుట్ అనేది దీనికి భిన్నమైనది. కంపెనీ బలవంతంగా ఉద్యోగం తీసివేయడం కాకుండా, ఉద్యోగులే స్వచ్ఛందంగా తప్పుకునేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధపడే వారికి ఒకేసారి భారీ నగదు, పొడిగించిన బీమా సదుపాయాలు, పదవీ విరమణ ప్రయోజనాలను ఆఫర్ చేస్తారు. లేఆఫ్స్ వల్ల వచ్చే వ్యతిరేకతను నివారించడానికి ఉద్యోగులకు గౌరవప్రదమైన రీతిలో వీడ్కోలు పలికేందుకు కంపెనీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి.

మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఎవరికి? అర్హతలు ఏమిటి?

కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఈ వన్ టైమ్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో దాదాపు 7% మందికి వర్తించనుంది. సీనియర్ డైరెక్టర్ స్థాయి, అంతకంటే తక్కువ కేడర్‌లోని ఉద్యోగులు దీనికి అర్హులు. ఇన్సెంటివ్ ఆధారిత సేల్స్ విభాగాల్లో ఉన్నవారికి ఈ అవకాశం లేదు. ‘అర్హులైన ఉద్యోగులు తమ భవిష్యత్తు నిర్ణయాలను సొంతంగా, కంపెనీ అందించే ఆఫర్‌ను తమ ఇష్టపూర్వకంగా పొందేలా ఈ కార్యక్రమం రూపొందించారు’ అని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ పేర్కొన్నారు.

అసలు సమస్య ఏమిటి?

టెక్ ప్రపంచంలో ప్రస్తుతం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల ఏర్పాటుపై భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ తన వనరులను పాత తరం సాఫ్ట్‌వేర్ సేవల నుంచి ఏఐ వైపు మళ్లించాల్సి ఉంది. ఈ క్రమంలో వేగంగా పెరుగుతున్న ఏఐ పెట్టుబడుల భారాన్ని తగ్గించుకోవడానికి శ్రామిక శక్తిని సర్దుబాటు చేస్తున్నారు. ఏఐ ఆటోమేషన్ వల్ల ప్రభావితమయ్యే పాత్రల నుంచి సిబ్బందిని తగ్గించి, కొత్త టెక్నాలజీకి అనుగుణంగా టీమ్స్‌ను పునర్నిర్మిస్తున్నారు. పనితీరు సమీక్షలను సరళీకృతం చేస్తూనే నైపుణ్యం గలవారిని నిలుపుకోవడానికి స్టాక్ ఆధారిత రివార్డులను ఇస్తున్నారు.

జూన్ 2025 నాటికి మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 2,28,000 మంది ఉద్యోగులను కలిగి ఉండగా అందులో 1,25,000 మంది అమెరికాలోనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని దఫాలుగా తొలగింపులు చేసిన ఈ కంపెనీ ఇప్పుడు బైఅవుట్ ద్వారా మానవీయ కోణంలో మార్పునకు శ్రీకారం చుట్టింది. ఖర్చుల తగ్గింపుతోపాటు ఏఐ భవిష్యత్తు కోసం ఒక కంపెనీ తనను తాను సిద్ధం చేసుకుంటున్న తీరుకు ఇది నిదర్శనం.

ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Advertisement
 
Advertisement
Advertisement