భారత ఆటోమొబైల్ రంగం ఒక చారిత్రాత్మక పరివర్తన దిశగా అడుగులు వేస్తోంది. 2027-32 కాలానికి సంబంధించి సవరించిన ‘కార్పొరేట్ యావరేజ్ ఫ్యుయెల్ ఎఫిషియెన్సీ’ (కేఫ్-3) నిబంధనలపై ప్రభుత్వం, పరిశ్రమ వర్గాల మధ్య ఒక సానుకూల ఏకాభిప్రాయం కుదరడం శుభ పరిణామం. గతంలో ప్రతిపాదించిన కఠిన నిబంధనలు వాహన తయారీదారులలో కొంత ఆందోళన కలిగించాయి. అయితే, తాజా ముసాయిదాలో ప్రభుత్వం వాస్తవిక దృక్పథాన్ని ప్రదర్శించింది.
గతంలో ప్రతిపాదన ప్రకారం.. ఐదేళ్ల పాటు స్థిరంగా 0.002 స్లోప్ కోఎఫీషియంట్(ఇది వాహనం బరువు, అది వినియోగించాల్సిన ఇంధన పరిమితి మధ్య ఉండే సంబంధాన్ని నిర్ణయిస్తుంది) గుణకాన్ని కొనసాగించాలని భావించారు. కొత్త నిబంధనల ప్రకారం.. దీన్ని 2027-28కి 0.00158కి, 2031-32 నాటికి 0.00131కి తగ్గించారు. దీనివల్ల తయారీదారులకు ఇంధన సామర్థ్య లక్ష్యాలను చేరుకోవడంలో సౌలభ్యం లభిస్తుంది. ముఖ్యంగా సబ్-4 మీటర్ల వాహన(4 మీటర్ల కంటే తక్కువ పొడువు) విభాగంలో తయారీదారులకు ఇది కలిసొచ్చే అంశం.
ప్రభుత్వం కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మీదనే భారం వేయకుండా బహుళ సాంకేతిక మార్గాలను పరిగణలోకి తీసుకుంది. హైబ్రిడ్, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు, బయో-ఫ్యూయల్స్ వాడకాన్ని ఈ ముసాయిదా స్పష్టంగా ప్రోత్సహిస్తోంది. స్టార్ట్-స్టాప్ సిస్టమ్స్, థర్మల్ మేనేజ్మెంట్ వంటి చిన్న మార్పుల ద్వారా వచ్చే సామర్థ్య లాభాలను కూడా లెక్కలోకి తీసుకోవడం విశేషం. దీనివల్ల ఐసీఈ ఇంజిన్లను ఆప్టిమైజ్ చేస్తూనే కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టే వీలు తయారీదారులకు కలుగుతుంది.
క్రెడిట్-డెబిట్ విధానం
పరిశ్రమలో అత్యంత సానుకూల స్పందన లభించిన అంశం 'పాస్ బుక్ సిస్టమ్'. లక్ష్యానికి మించి ఇంధన సామర్థ్యాన్ని సాధించే కంపెనీలు క్రెడిట్లను పొందుతాయి. వీటిని భవిష్యత్తులో లోటు ఏర్పడినప్పుడు సర్దుబాటు చేసుకోవచ్చు. బ్లాక్ పీరియడ్స్ (మొదట 3 ఏళ్లు, తర్వాత 2 ఏళ్లు)గా విభజించడం వల్ల సరఫరా గొలుసులో వచ్చే ఆకస్మిక అంతరాయాల నుంచి కంపెనీలకు రక్షణ లభిస్తుంది.
అమలులోనే అసలు పరీక్ష
ప్రభుత్వం రోడ్ మ్యాప్ ఇచ్చింది. సౌలభ్యాలను కల్పించింది. ఇక ఆటోమొబైల్ సంస్థల తీరు కీలకం కానుంది. కేవలం నిబంధనల కోసం కాకుండా ఈ కేఫ్-3 నిబంధనలను ఒక వ్యూహాత్మక మార్పుగా స్వీకరించాలి. అప్పుడే భారత్ గ్లోబల్ ఆటో హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలదు.
ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్..


