దెబ్బకు దిగొచ్చిన గూగుల్‌.. యాప్‌ డెవలపర్స్‌కు భారీ ఊరట

Google to reduce Play Store fee for all subscription services - Sakshi

Google Play Business Lower Fees: యాప్‌ డెవలపర్స్‌కు గూగుల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్లే స్టోర్‌ సబ్ స్క్రిప్షన్ కమిషన్‌ను భారీగా తగ్గించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇది 30 శాతం ఉండగా.. సగానికి సగం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది గూగుల్‌. 

ఆండ్రాయిడ్‌ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించడంతో పాటు థర్డ్‌ పార్టీగా ఉంటూ యాప్‌ డెవలపర్స్‌ను సైతం ఇబ్బంది పెడుతోందన్న ఆరోపణలు గూగుల్‌ ఎదుర్కొంటోంది. సబ్ స్క్రిప్షన్ బేస్డ్‌ బిజినెస్‌ ద్వారా అడ్డగోలు ఛార్జీలు వసూలు చేస్తూ వేధిస్తోందని భారత్‌ సహా చాలా దేశాల్లో గూగుల్‌ విచారణ, దర్యాప్తులను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో కమిషన్‌ను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. 

సబ్ స్క్రిప్షన్ కమిషన్‌ ఫీజును ఏకంగా 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది గూగుల్‌. అయితే మొదటి 1 మిలియన్‌ డాలర్ల మీద మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని డెవలపర్స్‌కు సూచించింది. తద్వారా యాప్‌ మేకర్స్‌కు భారీ ఊరట లభించినట్లయ్యింది.  గూగుల్‌ గణాంకాల ప్రకారం.. ఈ బంపరాఫర్‌ సుమారు 99 శాతం డెవలపర్స్‌కు వర్తించనుందట. తగ్గించిన కమిషన్‌ ఫీజును.. జనవరి 1, 2022 నుంచి అమలు చేయనుంది.

ఈ తగ్గింపుతో పాటు మీడియా యాప్స్‌ మీద సర్వీస్‌ ఫీజును 10 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్లే మీడియా ఎక్స్‌పీరియెన్స్‌ ప్రోగ్రామ్‌ కింద.. ఈ-బుక్స్‌, ఆన్‌ డిమాండ్‌ మ్యూజిక్‌, వీడియో సర్వీసులకు ఈ ఆఫర్‌ వర్తించనుంది. మీడియా బేస్డ్‌ యాప్స్‌ గూగుల్‌తో చేసే బిజినెస్‌ ఇది. ఉదాహరణకు.. యూట్యూబ్‌ మ్యూజిక్‌, స్పోటిఫైతో కలిసి చేస్తున్న ఒప్పందం లాగా అన్నమాట. క్లౌడ్‌ మార్కెట్‌ప్లేస్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ను ఇతరుల నుంచి కొన్నప్పుడు కూడా గూగుల్‌ కొంత పర్సంటేజ్‌ తీసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కమిషన్‌ కూడా విమర్శలు వెల్లువెత్తగా.. ఆ కమిషన్‌ను 20 నుంచి 3 శాతానికి తగ్గించుకున్నట్లు ఈ మధ్యే  ప్రకటించింది కూడా.

చదవండి: గూగుల్‌ కమిషన్‌ కక్కుర్తికి దెబ్బేసిన సౌత్‌ కొరియా

ఇదీ చదవండి: భారత్‌ యాక్షన్‌.. గూగుల్‌ కౌంటర్‌ రియాక్షన్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top