యాక్సిస్ బ్యాంక్ ఇటీవల తన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. ఈ ప్రకటనలో బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు వెల్లడించింది. గత సంవత్సరం 1.04 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య సుమారు 1.01 లక్షలకు తగ్గింది. అంటే సుమారు 3,000 మంది ఉద్యోగులు తగ్గారు.
బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమితాభ్ చౌదరీ తెలిపిన ప్రకారం.. ఈ తగ్గింపు ప్రత్యేకంగా ఏ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొని జరగలేదు. ఇది మొత్తం సంస్థలో సాధారణంగా జరిగిన మార్పు మాత్రమే. ముఖ్యంగా.. డిజిటల్ టెక్నాలజీపై చేసిన దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.
గత మూడు, నాలుగు సంవత్సరాలుగా యాక్సిస్ బ్యాంక్ తన ఆపరేటింగ్ ఖర్చులలో 9% నుంచి 10% వరకు టెక్నాలజీ కోసం ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడుల వల్ల ఇప్పుడు పనితీరు మెరుగుపడి, ఉత్పాదకత కూడా పెరిగింది. కొంతమంది ఉద్యోగులు తమ పనులను ఆటోమేషన్, టెక్నాలజీ ద్వారా వేగంగా చేయగలుగుతున్నారు.
ఇదీ చదవండి: వేకువజామునే ఈమెయిల్స్.. 30వేల మందికి లేఆఫ్స్!
పెద్ద స్థాయిలో ఉద్యోగాల తొలగింపు జరగలేదని బ్యాంక్ స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు (AI) కూడా ఇంకా ఉద్యోగాలను భర్తీ చేయడం ప్రారంభించలేదని, అది కేవలం ప్రక్రియలను వేగవంతం చేయడానికి మాత్రమే ప్రస్తుతం ఉపయోగపడుతోందని తెలిపింది. ఇదే సమయంలో, యాక్సిస్ బ్యాంక్ తన భౌతిక విస్తరణను కూడా కొనసాగిస్తోంది. గత సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా సుమారు 400 కొత్త శాఖలను ప్రారంభించింది. అంటే ఒకవైపు టెక్నాలజీ ద్వారా సామర్థ్యం పెంచుకుంటూ, మరోవైపు కస్టమర్ల కోసం శాఖలను కూడా పెంచుతోంది.


