సోషల్ మీడియా దిగ్గజాలు మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), గూగుల్, టిక్‌టాక్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. జర్నలిజం మనుగడ కోసం, వార్తా సంస్థలకు చెల్లింపులు చేయని పక్షంలో భారీగా పన్ను వసూలు చేసేలా రూపొందించిన కొత్త ముసాయిదా చట్టాన్ని విడుదల చేసింది.
వార్తలకు విలువివ్వాల్సిందే
జర్నలిస్టుల కష్టానికి తగిన ద్రవ్య విలువ ఉండాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సృజనాత్మకమైన వార్తా కంటెంట్‌ను ఉపయోగించుకుని బహుళజాతి సంస్థలు లాభాలు గడించడం తగదు. ఆ కంటెంట్‌ను ఉత్పత్తి చేసే వారికి తగిన పరిహారం అందాలి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నాణ్యమైన జర్నలిజం వెన్నెముక వంటిది’ అని పేర్కొన్నారు.
ప్రతిపాదిత చట్టం ముఖ్యాంశాలు
వార్తా సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నిరాకరించే ప్లాట్‌ఫారమ్‌లపై ఈ చట్టం కొరడా ఝుళిపించనుంది.
వార్తా ప్రచురణకర్తలతో ఒప్పందాలు చేసుకోని పక్షంలో, సదరు కంపెనీల వార్షిక ఆదాయంపై 2.25 శాతం పన్ను విధిస్తారు.
వార్తా సంస్థలకు చెల్లింపులు చేసే ప్లాట్‌ఫారమ్‌లకు పన్ను మినహాయింపులు (ఆఫ్‌సెట్లు) లభిస్తాయి.
ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని (సుమారు 200 - 250 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు), ఆయా వార్తా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
పాత చట్టంలో లొసుగులు
2021లో తెచ్చిన 'న్యూస్ మీడియా బేరసారాల కోడ్' నుండి తప్పుకోవడానికి కొన్ని సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వార్తలను తొలగించాయి. తాజా చట్టాన్ని అటువంటి లొసుగులను అరికట్టేలా రూపొందించారు.
భగ్గుమంటున్న టెక్ దిగ్గజాలు
ప్రభుత్వ నిర్ణయంపై మెటా, గూగుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ‘వార్తా సంస్థలు తమ ప్రయోజనం కోసమే మా ప్లాట్‌ఫారమ్‌లపై కంటెంట్‌ను పోస్ట్ చేస్తాయి. ఇది కేవలం ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు సంపదను బదిలీ చేసే పన్ను మాత్రమే’ అని మెటా విమర్శించింది.
ఇప్పటికే తాము వార్తా సంస్థలతో ఒప్పందాలు కలిగి ఉన్నామని, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్‌ఫారమ్‌లను మినహాయించి కేవలం తమనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని గూగుల్ పేర్కొంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్తల ప్రాముఖ్యతను కాపాడటమే లక్ష్యమని ఆస్ట్రేలియన్ ప్రభుత్వం చెబుతుండగా, ఇది డిజిటల్ రంగంపై అనవసరపు భారమని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చితే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా ఇదే బాట పడతాయేమో చూడాలి.


