సంప్రదాయ మోడల్‌లో ఏఐ పెను మార్పులు | Infosys CEO Predicts AI Reshapes Indian IT Workforce Pyramid Into Diamond Future And Says Major Shift In Hiring Trends | Sakshi
Sakshi News home page

సంప్రదాయ మోడల్‌లో ఏఐ పెను మార్పులు

Apr 30 2026 8:56 AM | Updated on Apr 30 2026 10:09 AM

AI Reshapes Indian IT Talent Pyramid into Diamond Future Infosys CEO Predicts

భారతీయ ఐటీ రంగం గత నాలుగు దశాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ ‘పిరమిడ్’ టాలెంట్ మోడల్‌లో కృత్రిమ మేధ పెను మార్పులు తీసుకురాబోతోంది. అట్టడుగున భారీ సంఖ్యలో ఫ్రెషర్లు, పైకి వెళ్లే కొద్దీ తగ్గే సీనియర్ల సంఖ్యతో కూడిన ఈ పిరమిడ్‌ మోడల్‌ నిర్మాణం రాబోయే రోజుల్లో ‘వజ్రం’ (Diamond) ఆకృతిని(అడుగున ఏఐ టూల్స్ ఎంట్రీ లెవల్ పనులను వేగంగా చేస్తాయి. దీనివల్ల ఫ్రెషర్ల అవసరం తగ్గుతుంది. మధ్య భాగంలో డైమండ్ వెడల్పుగా ఉంటుంది. అంటే, ఏఐని సమర్థవంతంగా వాడుకోగలిగే నిపుణులు ఎక్కువవుతారు) సంతరించుకోనుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ విశ్లేషించారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఐటీ కంపెనీల నియామక ప్రక్రియలో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ నిర్మాణాత్మక మార్పులు పూర్తిస్థాయిలో ప్రతిబింబించడానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.

ఏఐ సేవలే వృద్ధికి చోదక శక్తులు

ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ ఏఐ సేవల వ్యూహం తమకు అద్భుతంగా పనిచేస్తోందని పరేఖ్ ధీమా వ్యక్తం చేశారు. ‘సుమారు 300 బిలియన్‌ డాలర్ల మార్కెట్ అవకాశాన్ని కంపెనీ గుర్తించింది. ఇన్ఫోసిస్ ఆరు ప్రధాన విభాగాలపై దృష్టి సారించింది. పాత సేవలను ఏఐ ఆగ్మెంటెడ్ సర్వీసులుగా మారుస్తూ క్లయింట్లకు మరింత విలువను చేకూరుస్తోంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి స్థూల ఆర్థిక సవాళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే ఏడాదిలో వృద్ధి మెరుగ్గా ఉంటుంది’ అని అంచనా వేశారు.

20,000 మంది ఫ్రెషర్లకు చోటు

నియామకాలపై నెలకొన్న ఆందోళనలను తొలగిస్తూ గతేడాది తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా సుమారు 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు సలీల్ పరేఖ్ వెల్లడించారు. అయితే, వారి శిక్షణా విధానంలో భారీ మార్పులు చేశారు. ‘కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా ఫౌండేషన్ మోడల్స్ ఉపయోగించడంలో వారికి ప్రత్యేక శిక్షణ అవసరం. పిరమిడ్ ఆకారం మారినప్పటికీ నిపుణులైన వ్యక్తులతో పాటు ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేసే కొత్త వాతావరణం ఏర్పడుతుంది. భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన వారికే అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది’ అన్నారు.

ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్‌ ఆఫర్‌

Advertisement
 
Advertisement
Advertisement