స్వల్పకాలిక పంటలే మేలు | - | Sakshi
Sakshi News home page

స్వల్పకాలిక పంటలే మేలు

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

● జిల్లాపై ఎల్‌నినో ప్రభావం తక్కువగానే ఉండొచ్చు ● ఈ నెల 15 నుంచి కురిసే వర్షాలు సాగుకు అనుకూలం ● ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు

● జిల్లాపై ఎల్‌నినో ప్రభావం తక్కువగానే ఉండొచ్చు ● ఈ నెల 15 నుంచి కురిసే వర్షాలు సాగుకు అనుకూలం ● ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ‘జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినా జాగ్రత్తగా ఉండాలి. స్వల్పకాలిక పంటలు సాగు చేస్తే మేలు. విత్తన వ్యాపారుల నుంచి తప్పకుండా రశీదులు తీసుకోవాలి. ఈ నెల 15 నుంచి సాగుకు అనుకూల వర్షాలు కురిసే అవకాశం ఉంది.’ అని జిల్లా వ్యవసాయాధికారి వి.బాబూరావు, ఏడీఏ శోభన్‌బాబు, ఏఓ(టెక్నికల్‌) సాయినారాయణ సూచించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పలువురు రైతులు వ్యవసాయ అధికారులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సలహాలు, సూచనలు పొందారు.

ప్రశ్న: వరి విత్తనాల్లో ఏవి మేలైన రకాలు?

– నందమూరి రాము, దమ్మపేట, వజ్జ మహేష్‌, కరకగూడెం, మడకం శ్రీనివాసరావు, ములకలపల్లి

జవాబు: ప్రభుత్వం మిల్లింగ్‌ సామర్థ్యం ఉన్న ఆర్‌ఎన్‌ఆర్‌–15048, బీపీటీ–5204, కేఎన్‌ఎన్‌–1638, జైశ్రీరామ్‌, హెచ్‌ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్‌ –962, డబ్ల్యూజీఎల్‌–44, జేజీఎల్‌ –1798 రకాలను ప్రోత్సహిస్తోంది.

ప్ర: ఎకరానికి ఎంత యూరియా వాడాలి?

– సోయం నాగరాజు, ములకలపల్లి

జ : పంటను బట్టి యూరియా, దఫాదఫాలుగా వేసుకోవాలి. ఏ ఎరువైనా సరైన సమయంలో సరైన మోతాదులో సరైన పద్ధతిలో వేసుకుంటే మొక్కకు బాగా ఉపయోగపడుతుంది.

ప్ర: పెసరలో ఏ విత్తన రకం మంచిది?

– షేక్‌ ఖలీల్‌ మియా,పెనగడప,

చుంచుపల్లి మండలం

జ : ఎంజీజీ–295. మధిర పరిశోధనా స్థానంలో దొరుకుతుంది.

ప్ర: జీలుగు విత్తనాలు కావాలి.

– నూనావత్‌ రవి, పూసలతండ,

పాల్వంచ మండలం

జ : పాల్వంచ సొసైటీలో అందుబాటులో ఉన్నాయి

ప్ర: జిల్లాకు రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి?

– మాలోత్‌ వీరన్న, ఒడ్డుగూడెం, ఇల్లెందు

జ : ఈ నెల 15వ తేదీ వరకు విస్తరించవచ్చు. రైతులు భూమిలో సరిపడా తేమ వచ్చిన తర్వాత మాత్రమే విత్తనాలు వేసుకోవాలి

ప్ర: భూమిపట్టా లేనివారు యాప్‌ ద్వారా యూరియా పొందవచ్చా?

– వాంక్‌డోత్‌ రమేష్‌, సుజాతనగర్‌

జ : పొందవచ్చు. మీ వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద నమోదు చేయించుకోవచ్చు

ప్ర: ఆళ్లపల్లిలో సొసైటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి

– పాయం రమేష్‌, ఆళ్లపల్లి

జ : ఆళ్లపల్లిలో భవనాలు దొరకక ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతానికి అద్దె భవనం తీసుకున్నాం. అందులో సొసైటీ అందుబాటులో ఉంటుంది.

ప్ర: యూరియా యాప్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది.

– గొల్ల సత్యనారాయణ, అడపా శ్రీనివాసరావు, యర్రారెడ్డి వెంకటరెడ్డి– బయ్యారం,

పినపాక మండలం, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజాపురం, అన్నపురెడ్డిపల్లి

జ : వచ్చే సోమవారం నుంచి అందుబాటులోకి వస్తుంది

ప్ర: చౌడుని తట్టుకొనే వరి రకాలు తెలుపగలరు?

– చిన్నశెట్టి వెంకటనర్సయ్య,

నారాయణపురం, అశ్వారావుపేట

జ : ఆర్‌ఎన్‌ఆర్‌–11718, దాన్‌ –58 రకాలు తట్టుకుంటాయి

ప్ర: ఐదేళ్లు దాటిన ఆయిల్‌పామ్‌ తోటలో అంతరపంటగా ఏ పంటలు వేయవచ్చు?

– వాగబోయిన నరసింహా, కొమ్ముగూడెం

జ : కోకో పంటను అంతర పంటగా వేయవచ్చు

ప్ర: ఎల్‌నినో నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి పంటలు వేసుకోవాలి

– పెండేకట్ల పాపారావు, రాయపాడు,

ఆళ్లపల్లి మండలం

జ : ఎల్‌నినో ప్రభావం జిల్లాపై తక్కువగా ఉండే అవకాశం ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాధార భూముల్లో సాగు చేసే రైతులు తక్కువ పంట కాల సమయం ఉన్న పంటలను అంటే అపరాలను ఎంపిక చేసుకోవాలి. ప్రత్తి పంట వేసుకునే వారు అంతర పంటగా కందిపంటను వేసుకుంటే మంచిది. వర్షాధారం కింద వరి, మొక్కజొన్న పంటలను వేయొద్దు.

ప్ర: పత్తిలో నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా?

– వాగబోయిన సీతారాములు, గుండాల

జ : రైతులు అధీకృత డీలర్‌ వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. ఇంటి వద్దకు, మధ్యవర్తి ద్వారా, గుడ్డ సంచుల్లో అమ్మే విత్తనాలే కొనొద్దు. సీల్‌ చేసిన ప్యాకెట్‌/డబ్బాలో ఉన్న గింజలను మాత్రమే కొనాలి. విత్తన ప్యాకెట్‌పై క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే కంపెనీ తయారు దారు, ఇతర వివరాలు తెలుస్తాయి. బిల్లులో పంట, రకం, లాట్‌ /బ్యాచ్‌ నంబర్‌ ఉండేలా చూసుకుని, సంతకం చేసి తీసుకుని భద్రపరుచుకోవాలి.

ప్ర: బాడవ భూముల్లో వరి ఎలాంటి రకాలు వాడాలి?

– కూరపాటి ఆంజనేయులు,

ఆర్‌ కొత్తగూడెం, చర్ల మండలం

జ : బాడవ భూముల్లో నీరు అధికంగా నిలువ ఉంటుంది. మొదటగా నీటి కాల్వలు వేసుకోవాలి. పొలాన్ని ఎక్కువగా ఆరబెట్టుకోవాలి. కాండం గట్టిగా, పొట్టిగా ఉండే రకాలను ఎంచుకోవాలి. యూరియా తక్కువగా వాడాలి. స్వర్ణ సబ్‌1 (ఎంటీయు–1061), జేజీఎల్‌ 1798 (జగిత్యాల్‌ సన్నాలు), ఎంటీయూ 1140 అనుకూలంగా ఉంటాయి.

ప్ర: కేఎన్‌ఎన్‌ –1638 ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా?

– నాగళ్ల సతీష్‌, ములకలపల్లి

జ : కొనుగోలు చేస్తుంది. గడిచిన రబీలో జిల్లాలో ఈ రకం ధాన్యంలో నూక ఎక్కువగా వచ్చింది. వేరే రకాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement