బోనస్‌ 8 రకాలకేనా? | - | Sakshi
Sakshi News home page

బోనస్‌ 8 రకాలకేనా?

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

● గతేడాదిలాగా 33 సన్న రకాల వడ్లకు ఇస్తారా..! ● వానాకాలంలో పండించనున్న ధాన్యంపై స్పష్టత కరువు ● మరోవైపు 8 రకాల సన్నాలే సాగు చేయాలని ప్రభుత్వ సూచన ● అయోమయానికి గురవుతున్న అన్నదాతలు ప్రభుత్వం సూచించిన రకాలనే సాగు చేయాలి

గతేడాది 33 రకాలకు..

● గతేడాదిలాగా 33 సన్న రకాల వడ్లకు ఇస్తారా..! ● వానాకాలంలో పండించనున్న ధాన్యంపై స్పష్టత కరువు ● మరోవైపు 8 రకాల సన్నాలే సాగు చేయాలని ప్రభుత్వ సూచన ● అయోమయానికి గురవుతున్న అన్నదాతలు

బూర్గంపాడు: మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న 8 రకాల సన్న వడ్లనే సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టింది. దీంతో ఈ ఎనిమిది రకాల సన్నాలకే ప్రభుత్వం బోనస్‌ అందిస్తుందా..? లేకుంటే ఇతర సన్నరకాలకు కూడా అందిస్తుందా? అని రైతులు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో రైతులు అధిక దిగుబడులిచ్చే సన్నరకాలను వదులుకుని ప్రభుత్వం సూచించిన రకాల వైపే మొగ్గు చూపాల్సి వస్తోంది.

యాసంగి ధాన్యం అమ్మకాల్లో నానాయాతన

యాసంగి ధాన్యం అమ్మకాల్లో రైతులు ఇబ్బందులు పడాల్సివచ్చింది. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు అమ్ముకోలేక, ప్రభుత్వం కొనుగోలు చేయక నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచిచూడాల్సి వచ్చింది. కొందరు విసిగివేసారి తక్కువ ధరలకు ప్రైవేటు వ్యాపారులకు, మిల్లర్లకు విక్రయించుకున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో యాసంగి ధాన్యం అమ్మకాలు పూర్తికాలేదు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం వానాకాలం సీజన్‌లో డిమాండ్‌ ఉన్న సన్నరకాలను సాగు చేయాలని ముందస్తుగా సూచిస్తోంది. వీటికి బహిరంగ మార్కెట్‌లో కూడా డిమాండ్‌ ఉంటుండటంతో రైతులు నష్టపోయే అవకాశం ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కొన్ని సన్నాలు తినేందుకు అనువుగా లేవని..

ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి రేషన్‌ షాపుల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనానికి, ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల భోజనానికి అందిస్తోంది. కొన్ని రకాల సన్నబియ్యం చూసేందుకు సన్నగా ఉన్నా అన్నం వండాక దొడ్డు కావటం, అన్నం మెతుకుల పొట్ట పగలటం, రుచిగా లేకపోవటం వంటివి జరుగుతున్నాయి. రైతులకు బోనస్‌ అందించి కొనుగోలు చేసిన సన్న బియ్యం కూడా తినేందుకు అనువుగా లేకపోవటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏఏ రకం సన్నాలకు బోనస్‌ ఇచ్చేది ప్రస్తుతం ప్రకటించకపోయినా ప్రభుత్వం సూచించిన 8 రకాలకే బోనస్‌ వస్తుందనే చర్చ రైతుల్లో సాగుతోంది.

ప్రభుత్వం సూచించిన 8 సన్న రకాలనే వానాకాలం సీజన్‌లో రైతులు సాగు చేస్తే మంచిది. ఇవి అధిక దిగుబడులిస్తాయి. బియ్యం నాణ్యతగా ఉండటంతోపాటు బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న రకాలు. ప్రభుత్వం ఈ ఎనిమిది రకాలకే బోనస్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

–బి.తాతారావు, ఏడీఏ, మణుగూరు

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది వానాకాలం సీజన్‌లో 33 రకాల సన్నాలకు బోనస్‌ ప్రకటించింది. క్వింటాల్‌కు రూ.500 చొప్పున చెల్లించింది. ఈ ఏడాది మాత్రం బీపీటీ–5204(సాంబమసూరి), జేజీఎల్‌–1738, కేఎన్‌ఎం–1638, ఆర్‌ఎన్‌ఆర్‌–15048(తెలంగాణ సోన), డబ్ల్యూజీఎల్‌–44(సిద్ధి), డబ్ల్యూజీఎల్‌–962, జైశ్రీరాం, హెచ్‌ఎంటీ(సోన) వరి రకాలను సాగు చేయాలని చెబుతోంది. వీటికి బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. అయితే ఈ ఎనిమిది రకాల పంటకాలం ఎక్కువగా ఉండటం, చీడపీడలు, పురుగు, దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. వీటికంటే తక్కువ కాలపరిమితిలో ఎక్కువ దిగుబడులు ఇచ్చే సన్న రకాలను ప్రభుత్వం సూచించకపోవటం విచారకరమని అంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement